పరిగి: బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లను ఇస్తామని నమ్మించి, ఓట్లేయించుకుని మోసం చేస్తారా? బీసీలంటే అంత చులకనా? మాట తప్పిన ప్రభుత్వానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా బుద్ధి చెప్పడం ఖాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. ఆదివారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. శ్రీరంగరాజుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను సూపర్‌గా మోసం చేశారని విమర్శించారు. 18 ఏళ్ల నిండిన వారికి నెలకు రూ.1800 ఇస్తామని మహిళలను మోసం చేశారన్నారు. తల్లికి వందనం పథకాన్ని కూడా అరకొరగానే అమలు చేశారని మండిపడ్డారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లను ఇస్తామన్న హామీపై నేటికీ ఊసెత్తని సీఎం చంద్రబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందేవన్నారు. కానీ నేడు యూరియా బస్తా కావాలంటే ఓటీపీ అంటూ ఇబ్బందులు పెడుతూ రెండు మూడు బస్తాలతో సరిపెట్టే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. పెన్నా, జయమంగళీ నదుల్లో ఉన్న ఇసుకంతా టీడీపీ నాయకులే దోచేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మంత్రి సవిత, ఆమె అనుచరులు నిత్యం ప్రజాధనాన్ని నిలువునా దోచేస్తున్నారని.. ఇసుక, మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేసి అడ్డదారుల్లో అమ్మేసి కోట్లాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్‌పై కేంద్రంతో మాట్లాడే ధైర్యం ఏదీ?
సీఎం చంద్రబాబు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని నమ్మించి సుప్రీంకోర్టు తీర్పుతో మొహం తెల్లబోయిందని ఉషశ్రీచరణ్ అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ఆయన.. తాను అనుకున్న రిజర్వేషన్ సాధించవచ్చ కదా అని ప్రశ్నించారు. మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రం దిగి వచ్చి బీసీ రిజర్వేషన్‌పై అమెన్‌మెంట్ ఇస్తుందని కదా అని హితవు పలికారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లకుండా కేవలం రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పేరుతో డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను బ్యాక్ బోన్ క్యాష్ట్‌గా చూసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


