ధర్మవరం రూరల్: మండలంలోని మాలగుండ్లపల్లికి చెందిన లక్ష్మిదేవి, జగన్నాథ దంపతుల కుమారుడు దేవర రాజు(26) ఆదివారం నూర్పిడి యంత్రం బోల్తా పడడంతో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. 15 రోజుల క్రితం అతడికి వివాహం జరిగింది. కుటుంబ పోషణ నిమిత్తం పక్క గ్రామమైన రావులచెరువు గ్రామానికి వేరుశనగ కట్టిని ఆడించడానికి భార్య విద్యాశ్రీతో కలిసి వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో ట్రాక్టర్ పెద్ద రాయిని బలంగా ఢీకొనడంతో నూర్పిడి యంత్రం బోల్తా పడింది. నూర్పిడి యంత్రం దేవర రాజుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా పక్కనే కూర్చున్న విద్యాశ్రీ ఎగిరిపడి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయట పడింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


