రూ.2 కోట్లపైగా మోసం.. ఇద్దరు నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్లపైగా మోసం.. ఇద్దరు నిందితుల అరెస్టు

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

కదిరి టౌన్‌: ప్రైవేట్‌ చీటీల పేరుతో రూ.2 కోట్లకుపైగా మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్‌నగర్‌లో ఉన్న నిందితులు పోరెడ్డి చిన్నరెడ్డి, పోరెడ్డి మనోజ్‌ కుమార్‌రెడ్డిని అరెస్టు చేశామన్నారు. ఇంకో నలుగురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు.

పేకాట స్థావరాలపై దాడి

కదిరి టౌన్‌: మున్సిపల్‌ పరిధిలోని కుటాగుళ్ల గ్రామ శివార్లలోని చెరువు వద్ద పేకాట స్థావరాలపై ఆదివారం పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ బాబ్జాన్‌, సిబ్బంది ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.30,200 స్వాధీనం చేసుకుని, మూడు మోటార్‌ సైకిళ్లను సీజ్‌ చేసినట్లు సీఐ తెలిపా రు. పోలీసులను చూసి మరికొంత మంది జూదరులు పరారయ్యారు. గ్రామాల్లో పేకాట, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ప్రజలు పోలీస్‌స్టేషన్‌ లేదా 112కు సమాచారం అందించాలని సీఐ సూచించారు.

యువతి అదృశ్యం

ముదిగుబ్బ: ముదిగుబ్బకు చెందిన తోమల సుప్రియ అనే యువతి మూడు రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కదిరి రోడ్డులోని సోమిరెడ్డి కట్ల మిషన్‌ వెనుకవైపు నివాసమున్న యువతి ఈ నెల 8న ముదిగుబ్బలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్తానని తల్లి అనురాధతో చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. పలుచోట్ల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

గుర్తు తెలియని

వృద్ధుడి మృతదేహం లభ్యం

మడకశిర: పట్టణంలోని పావగడ రోడ్డులో ఉన్న శివాలయం సమీపంలో ఆదివారం సాయంత్రం ఓవృద్ధుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచినట్లు మడకశిర అప్‌గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ శివరాముడు తెలిపారు. వృద్ధుడిది సహజ మరణంగా భావిస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9490112475 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

అప్పులబాధతో

యువకుడి ఆత్మహత్య

నార్పల: మండల కేంద్రంలోని చైతన్య కాలనీకి చెందిన పశవుల అనిల్‌ (22) అప్పులబాధ తాళలేక పురుగు మందు తాగి మృతిచెందాడు. వివరాలు.. చైతన్య కాలనీకి చెందిన పశవుల లక్ష్మీదేవికి కుమారులు వెంకట శివ, అనిల్‌ ఉన్నారు. ఆమె భర్త నాగరాజు 20 సంవత్సరాల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందాడు కుమారులను ఇంటర్‌ వరకు చదివించింది. పెద్ద కుమారుడు బెంగుళూరులో ఒక ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇంటి వద్ద లక్ష్మీదేవి, చిన్న కుమారుడు మగ్గం పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం సుమారుగా రూ.8 లక్షల అప్పుచేశారు. మగ్గం పనులు గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోయారు. ఈక్రమంలో ఇంటి కోసం తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో తెలియక అనిల్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం తల్లి పని మీద బయటకు వెళ్లగా.. అతడు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే బంధువులు అతడిని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విగతజీవిగా ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి కన్నీరుమున్నీరయింది.

విద్యుదాఘాతంతో

గొర్రెల మృతి

తలుపుల: మండలంలోని జ్యోతివాండ్లపల్లిలో పెద్దినాయుడుకు చెందిన 21 గొర్రెలు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందాయి. వివరాలు.. పెద్దినాయుడు రోజు మాదిరిగానే మేపు అనంతరం శనివారం రాత్రి షెడ్డులోకి గొర్రెలను తోలాడు. ఆదివారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో న్యూటల్‌ ఫెయిలై హై ఓల్టేజీ విద్యుత్‌ ప్రసరించింది. రేకుల షెడ్డు కావడంతో ఫ్యాన్‌తోపాటు ఐరన్‌ కంచెకు విద్యుత్‌ ప్రసారం కావడంతో గొర్రెలు అక్కడిక్కడే మృతిచెందాయి. అక్కడే నిద్రించిన అతడి భార్యకు సైతం చేతికి షాక్‌ కొట్టి కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే గొర్రెలు మొత్తం చనిపోవడంతో దాదాపు రూ. 3.50 లక్షలు నష్టపోయినట్టు బాధితుడు వాపోయాడు. అధికారులు ఆదుకోవాలని వేడుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement