● స్థల పరిశీలన చేసిన అధికారులు
ఎన్‌పీకుంట: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు రెవెన్యూ, టూరిజం ప్రతినిధుల బృందం సోమవారం స్థల పరిశీలన చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ దేవేంద్రనాయక్ మాట్లాడుతూ... సుమారు రూ.9 కోట్ల వ్యయంతో తిమ్మమ్మ మర్రిమాను వద్ద బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్థల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రహదారి సౌకర్యం, అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలు తదితర వాటిని పరిశీలించి, వివరాలను సేకరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డీటీతో పాటు టూరిజం ప్రతినిధుల బృందం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
ముంబై – చైన్నె బీచ్ మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
గుంతకల్లు: దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి ముంబై–చైన్నెబీచ్ మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. ముంబై జంక్షన్ నుంచి ప్రతి బుధవారం అర్ధరాత్రి 12.35 గంటలకు స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు (01015) బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు చైన్నె బీచ్‌కు చేరుతుందని పేర్కొన్నారు. ఈ రైలు ఈ నెల 14 నుంచి నవంబర్ 18 వతేదీ వరకు దాదాపు 6 సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్లు వెల్లడించారు. 15వ తేదీ (గురువారం) తెల్లవారుజూమున 4.00 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్ నుంచి స్పెషల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (01016) బయలుదేరి ముంబై జంక్షన్‌కు శుక్రవారం తెల్లవారుజూమున 4.05 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైళ్లు దాదర్, థానే, కళ్యాణ్, లోనవాల, పుణే, దౌండ్, కుర్దువాడి, షోలాపూర్, కలబురిగి, వాడి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, అరక్కోణం, పెరంబూర్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ‘పచ్చ’ దౌర్జన్యం
● రహదారి ఆక్రమణను అడ్డుకున్నందుకు దాడి
పుట్టపర్తి: రహదారి ఆక్రమణను అడ్డుకున్నారన్న కోపంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన బుక్కపట్నం మండలం చింతలయ్యగారిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి ఆర్డీటీ సంస్థ నిర్మించిన గృహ సముదాయాల వరకూ రహదారి ఉంది. 50 ఏళ్లుగా అదే రహదారిపై జనం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఇటీవల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గంగప్ప, సూర్యచంద్ర ఆ రహదారిని ఆక్రమించారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణం కోసం రహదారిపై పునాదులు తవ్వేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి ఇసుక, రాళ్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఇది గమనించిన నరసింహులు, డేవిడ్, మహేష్ వారిని అడ్డుకున్నారు. రహదారిపై పునాదులు ఎలా వేస్తారని ప్రశ్నించారు. దీంతో గంగప్ప, సూర్యచంద్ర వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో నరసింహులు, డేవిడ్, మహేష్ గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తమపై దాడి చేసిన వారిపై పోలీసులు వెంటనే కేసులు నమోదు చేసి రహదారి ఆక్రమణను అడ్డుకోవాలని బాధితులు కోరుతున్నారు.
జాతీయ వర్క్‌షాప్‌నకు అధ్యాపకురాలి ఎంపిక
తనకల్లు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు ప్రమీల ఢిల్లీలో ఎన్‌సీఈఆర్టీ నిర్వహిస్తున్న ‘జాతీయ విద్యా విధానం 2020’ వర్క్‌షాప్‌నకు ఎంపికయ్యారు. ఇంటర్మీడియెట్ విద్యా విధానం, పరీక్షల్లో మార్పులు తీసుకురావడానికి ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. ఇంటర్ బోర్డు తరఫున పాల్గొంటున్న ఆమె...ఇంటర్ విద్యావిధానం, పరీక్షలలో మార్పులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించనున్నారు.


