మీకు కరువు కనిపించడం లేదా? | - | Sakshi
Sakshi News home page

మీకు కరువు కనిపించడం లేదా?

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

రొద్దం: ‘మండలంలో మోస్తరు వర్షం కూడా కురవలేదు. చెరువులన్నీ ఎండిపోయాయి. భూగర్భజలమట్టం పూర్తిగా పడిపోయింది. బోర్లన్నీ ఎండిపోయి ఖరీఫ్‌ పంటలన్నీ చేతికందకుండా పోయాయి. పశువులకు గ్రాసం కూడా దొరకడం లేదు. రైతులు, కూలీలు ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయినా మీ కళ్లకు కరువు కనిపించడం లేదా.. సొంత నియోజకవర్గంలో దారుణ పరిస్థితులున్నా.. ఇంత దుర్మార్గంగా ఉంటారా?’’ అని మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథిపై వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. రొద్దం మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉషశ్రీచరణ్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, రైతులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్‌ మాట్లాడుతూ... తీవ్ర కరువు బారిన పడిన రొద్దం మండలాన్ని చంద్రబాబు ప్రభుత్వం మధ్యస్త కరువు మండలాల జాబితాలో చేర్చిందని, దీనివల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. సాగు, తాగునీరు లేక ప్రజలు, పశువులు అల్లాడుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనీసం హిందూపురం పార్లమెంట్‌ సభ్యుడు బీకే పార్థసారథి అయినా తన సొంత మండలాన్ని కరువు జాబితాలో చేర్చించలేకపోయారన్నారు. ఇది ఆయన పనితీరుకు, రైతులపై ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. ఇక మంత్రి సవిత కూడా ఈ ప్రాంత రైతుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. వెంటనే వారు స్పందించి కరువుపై కేంద్ర బృందానికి నివేదికలు పంపే విధంగా చర్యలు తీసుకుని రొద్దం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేలా చూడాలన్నారు. జాబితాలో చేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌ ఉదయశంకర్‌రాజుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ బి.తిమ్మయ్య, నాయకులు ఎన్‌.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, నరేంద్రరెడ్డి, జెట్టి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీసెల్‌ మండల అధ్యక్షుడు మూలింటి రమణ, శివన్న, లక్ష్మీనారాయణరెడ్డి, సినిమా నారాయణ, టీకొట్టు బాబు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

ఇసుక కోసమే నీళ్లు వదలడం లేదా?

తమ ప్రభుత్వ హయాంలో పెన్నానది గుండా పేరూరు డ్యాంకు నీరు వదిలి రైతులను ఆదుకున్నామని ఉషశ్రీచరణ్‌ అన్నారు. పేరూరు డ్యాంకు నీరు వదలం ద్వారా చిన్నకోడిపల్లి, కందుకూర్లపల్లి, రొద్దం, నాగరనాగేపల్లి తదితర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఇప్పడు పెన్నానదిలో నీరు వదిలితే అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ రవాణాకు ఇబ్బందులు కలుగుతాయనే నీరు వదలడం లేదని విమర్శించారు.

మంత్రి సవిత, ఎంపీ బీకేపై

ఉషశ్రీచరణ్‌ ఆగ్రహం

రొద్దం మండలాన్ని వెంటనే కరువు జాబితాలో చేర్చాలని డిమాండ్‌

వైఎస్సార్‌ సీపీశ్రేణులు, రైతులతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement