‘చుక్కల’ సమస్య పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

‘చుక్కల’ సమస్య పరిష్కరించండి

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

ఎన్‌పీకుంట: రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. చుక్కల జాబితాలో చేర్చిన తమ భూ సమస్య తీర్చడం లేదని అన్నమయ్య జిల్లా మదార్‌సాబ్‌పల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఎస్‌.గౌస్‌పీర్‌, మక్బూల్‌జాన్‌ సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనకు దిగారు. అనంతరం తహసీల్దార్‌ లక్ష్మమ్మకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వృద్ధ దంపతులు మాట్లాడుతూ... మరికొమ్మదిన్ని గ్రామ పొలం సర్వే నంబరు 636లో 2.59 ఎకరాల భూమి తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని, అయితే సదరు భూమిని అధికారులు 22–ఏ నిషేధిత (చుక్కల పట్టా) జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సమస్యను పరిష్కరించాలని గతంలో ‘మీ–సేవ’లో దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. దీనిపై స్పందించిన మండల, డివిజన్‌ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపించారని, విచారణ సమయంలో భూమికి సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూమి కాదని నిర్ధారించారన్నారు. వెంటనే 22–ఏ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్‌కు స్పష్టమైన నివేదిక అందించారన్నారు. ప్రస్తుతం ఆ ఫైల్‌ కలెక్టరేట్‌లోని ల్యాండ్‌ సెక్షన్‌ విభాగంలో పెండింగ్‌లో ఉందన్నారు. కలెక్టర్‌ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో కలెక్టరేట్‌ ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేస్తామన్నారు. వృద్ధుల భూ సమస్యపై డిప్యూటీ తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌ను వివరణ కోరగా... డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కమిటీ (డీఎల్‌సీ)లో ఫైల్‌ అప్రూవ్‌ అయ్యిందని, సమస్య పరిష్కారానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడుతాయని తెలిపారు.

కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వృద్ధ దంపతుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement