ప్రశాంతి నిలయం: ‘‘చిలమత్తూరు మండలం కోడూరు రెవెన్యూ పరిధిలోని మదురేపల్లిలో సర్వే నంబర్ 326–1, 325–1లో మాకు వారసత్వంగా సంక్రమించిన పొలంలో పంచాయతీ రాజ్ అధికారులు కోడూరు–మొరంపల్లి రహదారి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మా పట్టా భూమిలో రోడ్డు నిర్మించరాదని మేము హైకోర్టులో పిటిషన్ వేశాం. నాలుగేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. అయినా అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో మా పొలంలో రోడ్డు వేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే వారిని అడ్డుకుని మాకు న్యాయం చేయండి’’ అని కోడూరుకు చెందిన రైతులు బూగానపల్లి లక్ష్మీపతిరెడ్డి, సుధాకర్‌రెడ్డి... జేసీ మౌర్య భరద్వాజ్‌కు విన్నవించారు. ఈమేరకు అర్జీ ఇచ్చారు.
● కోర్టులో కేసున్నా.. పాసుబుక్కులిచ్చారు
కొత్తచెరువు మండలం నారేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే 126లో 1.97 ఎకరాల భూమికి సంబంధించి పుట్టపర్తి సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తోందని, అయితే తమ ప్రత్యర్థులతో కుమ్మక్కైన గ్రామ రెవెన్యూ సర్వేయర్ హరీష్, వీఆర్‌ఏ ఎల్లప్ప సదరు భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరుకు సిఫార్సు చేశారని నారేపల్లికి చెందిన నాగలక్ష్మమ్మ జేసీ ఫిర్యాదు చేశారు. తాము రీ సర్వేలో అభ్యంతరం తెలిపినా పట్టించుకోకుండా సర్వేయర్ హరీష్ తమకు అన్యాయం చేశారని వాపోయారు. వెంటనే వారిద్దరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు విన్నవించారు.
‘పరిష్కార వేదిక’కు 357 అర్జీలు
సోమవారం స్థానిక రెవెన్యూ భవన్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 357 అర్జీలు అందగా...వాటిని ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ఎస్‌డీసీ విజయకుమారితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్‌కు రైతుల వినతి


