జిల్లాలో నమోదైన పోక్సో కేసులు..
సంవత్సరం కేసుల
సంఖ్య
2022 70
2023 58
2024 60
2025 86
2026 17
సాక్షి, పుట్టపర్తి
ఎన్ని చట్టాలు వచ్చినా... ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చిన్నారులపై లైంగిక దాడులు ఆగడం లేదు. తల్లిదండ్రులు కాస్త ఆదమరిస్తే చాలు మృగాళ్లు నీచానికి పాల్పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసి జనాన్ని మత్తులో చిత్తు చేస్తుండగా...పిచ్చెక్కిన వారు వయసుతో సంబంధం లేకుండా.. వరుసలు తెలియకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.
‘దిశ’ మారిన చట్టం.. పెరిగిన కేసులు..
జిల్లా ఏర్పడిన తొలి నాళ్లలో అప్పటి వైఎస్ జగన్ సర్కార్ ‘దిశ’ చట్టంతో పాటు దిశ బృందాలను ఏర్పాటు చేయడం... సచివాలయంలో ప్రత్యేకంగా మహిళా పోలీసును నియమించింది. అలాగే దిశ యాప్ ద్వారా నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో లైంగిక దాడులు, వేధింపుల కేసుల సంఖ్య తగ్గింది. ఆ తర్వాత కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం ‘దిశ’ చట్టాన్ని తుంగలో తొక్కి దిశ పోలీసు స్టేషన్లను మహిళా పోలీసు స్టేషన్లుగా పేరుమార్చి కేవలం కౌన్సెలింగ్‌కు పరిమితం చేసింది. దీంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులు...దాడులు చేస్తూ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పోక్సో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 2025లో జిల్లా వ్యాప్తంగా ఏకంగా 86 పోక్సో కేసులు నమోదు కావడం గమనార్హం.
అవగాహన కల్పిస్తున్నాం
లైంగిక వేధింపులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులవుతారన్న విషయం గ్రహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పోక్సో కేసుతో కలిగే నష్టాలను వివరిస్తున్నాం. నేరం రుజువైతే ముద్దాయి జైల్లో శిక్ష అనుభవిస్తే...ఆ కుటుంబం సమాజంలో విలువ కోల్పోయి శిక్ష అనుభవిస్తుందని తెలియజెపుతున్నాం. అదేవిధంగా పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.
– మహేశ్, డీసీపీఓ, పుట్టపర్తి
ఏడాది క్రితం రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికను భయపెట్టి లొంగదీసుకున్న కొందరు యువకులు కొన్ని నెలల పాటు లైంగిక దాడి చేశారు. బాధిత బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 17 మంది కటకటాల పాలయ్యారు.
గతేడాది తనకల్లు మండలంలో ఓ ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న బాలికను లైంగికంగా వేధించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు కీచకుడిపై చర్యలు తీసుకున్నారు.
పుట్టపర్తి మండలం బత్తలపల్లిలో వరుసకు పెదనాన్న అయిన వ్యక్తి... 8వ తరగతి బాలికపై లైంగికదాడికి యత్నించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నా.. అందరూ బంధువులే కావడంతో హెచ్చరించి పంపించారు.
...ఇలా జిల్లాలో నిత్యం ఎక్కడోచోట చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా...కళ్లముందే ఎందరో జీవితాలు బలవుతున్నా మృగాళ్లలో మార్పురావడం లేదు. మద్యం ఊరూరా ఏరులై పారుతుండగా తప్పతాగుతున్న వారు విచక్షణ కోల్పోయి దుర్మార్గాలకు తెగబడుతున్నారు.


