వ్యక్తిని హతమార్చిన కేసులో..
హిందూపురం: తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసిన భార్యకు ఆమె ప్రియుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ హిందూపురం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి వి.వెంకటేశ్వరరావు శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. చిలమత్తూరు మండలం కోట్లోపల్లికి చెందిన పోలేపల్లి ఆంజనేయులు, పోలేపల్లి లక్ష్మి దంపతులు. లక్ష్మికి అదే గ్రామానికి చెందిన ఫిరంగి శ్రీధర్‌తో అక్రమ సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయినా లక్ష్మి తన పద్ధతి మార్చుకోలేదు. పైగా తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ఇదే విషయాన్ని ప్రియుడు ఫిరంగి శ్రీధర్‌కు చెప్పి హత్యకు పథకం వేసి అమలు చేసింది.
నిద్రలేచి చూసే సరికి కనిపించలేదని నాటకం..
2018 జూలై 30వ తేదీ రాత్రి తాను, తన భర్త ఆంజనేయులు ఒకే గదిలో పడుకున్నామని.. ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆయన కనిపించలేదని లక్ష్మి అందరినీ నమ్మించింది. దీంతో ఆంజనేయులు తల్లి నంజమ్మ ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపి ఫిర్యాదు చేయగా వ్యక్తి అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా అప్పటి హిందూపురం రూరల్ సీఐ టి.వెంకటేశులు, చిలమత్తూరు ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్ గ్రామంలో విచారించి వివరాలు సేకరించారు. అనంతరం కుషావతి నదీ పరివాహక ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా.. ఆ మృతదేహం ఆంజనేయులుదేనని తేలింది. వెంటనే ఆంజనేయులు భార్య లక్ష్మిని, ఆమె ప్రియుడు ఫిరంగి శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో లక్ష్మి నేరం అంగీకరించింది. 2018 జూలై 30వ తేదీ రాత్రి తన భర్త ఆంజనేయులు ఇంటికి వచ్చాక...తాను, తన ప్రియుడు ఫిరంగి శ్రీధర్ అతన్ని మరుగుదొడ్డిలో బంధించి గొంతు నులిమి చంపేశామని తెలిపింది. అనంతరం మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి ముద్దేపల్లి సమీపంలోని కుషావతి నది పరివాహక ప్రాంతంలో పడవేసినట్లు వెల్లడించింది. దీంతో పోలీసులు ఇరువురిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు స్థానిక అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో నడుస్తూ వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనంత గోపాలకృష్ణ వాదనలు వినిపించారు. మొత్తం 17 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి వి.వెంకటేశ్వరరావు లక్ష్మి, ఆమె ప్రియుడు ఫిరంగి శ్రీధర్‌కు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. అదేవిధంగా సెక్షన్ 201 ఐపీసీ కింద ఒక్కొక్కరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధించారు. ముద్దాలకు శిక్ష పడేలా కేసు దర్యాప్తు చేసి కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టిన కేసు దర్యాప్తు అధికారి సీఐ వెంకటేశ్వర్లు, కోర్ట్ మానిటరింగ్ సెల్ సీఐ ఇస్మాయిల్, ఏపీపీ గోపాలకృష్ణ, ప్రాసిక్యూషన్ మానిటరింగ్ అధికారులను ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక అభినందించారు.


