సాక్షి, పుట్టపర్తి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపుతున్నాయి. గురువారం అనంతపురంలో నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేయగా... శ్రీసత్యసాయి జిల్లాలోనూ నకిలీ నోట్ల చెలామణిపై చర్చ జరుగుతోంది. ఐస్ క్రీమ్ వాహనాలు, చిల్లర దుకాణాలు, వృద్ధులు నిర్వహించే అంగళ్లలో దొంగ నోట్ల మార్పిడి చేసేందుకు నిందితులు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే హిందూపురం, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలో వెలుగు చూసిన నకిలీ నోట్ల వ్యవహారం తాజాగా హాట్ టాపిక్‌గా మారింది.
ఐదు రోజుల తర్వాత టాయ్ నోట్లుగా..
గత మే నెలలో చిలమత్తూరు, లేపాక్షి మండల కేంద్రాల్లో నకిలీ నోట్ల దందా వెలుగు చూసింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఐదు రోజుల తర్వాత అరెస్టు చూపించారు. అప్పటికే కేసును నీరుగార్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అవన్నీ టాయ్ నోట్లుగా పోలీసులు వెల్లడించారు. దీనికి తోడు అరెస్టు చూపిన గంటల వ్యవధిలోనే నిందితులందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. నిందితులంతా కూటమి పార్టీల నేతలే కావడంతో పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని సమాచారం. దొంగ నోట్లను టాయ్ నోట్లుగా చిత్రీకరిస్తూ కేసును తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారం రోజుల క్రితం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో పోలీసులు చెబుతున్న ‘టాయ్ నోటు’ ఒకటి వెలుగు చూసింది. అయితే బాధితులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు పట్టించుకోలేదు.
వైట్ గా మారుస్తున్నారని టాక్..
దొంగనోట్ల వ్యవహారంలో నల్లధనమే ఎక్కువగా ఉంటోందని తెలిసింది. అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బును వైట్ లోకి మార్చుకునే కుట్రలో భాగంగా నకిలీ నోట్లను తీసుకొచ్చి జనాల్లో చెలామణి చేస్తున్నారని సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కాంట్రాక్టు పనులు చేసి నకిలీ నోట్లను కూలీలకు ఇచ్చి.. ఆ తర్వాత అసలు నోట్లను బిల్లుల రూపంలో పొందే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలిసింది.
జిల్లాలో విచ్చలవిడిగా వెలుగులోకి
ఐస్ క్రీమ్ బండ్లు, చిల్లర దుకాణాల్లో చెలామణి
‘పురం’లో నిందితులు దొరికినా
కేసుతో సరిపెట్టిన పోలీసులు


