జీతం లేకుండా మీరు పనిచేస్తారా? | - | Sakshi
Sakshi News home page

జీతం లేకుండా మీరు పనిచేస్తారా?

Jul 4 2026 12:38 AM | Updated on Jul 4 2026 12:38 AM

చిలమత్తూరు: ‘‘జీతం లేకుండా మీరు పనిచేస్తారా... ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి కదా.. ఒక్కనెల రాకపోతేనే కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతుంది. మరి పంచాయతీ కార్మికులకు నెలల తరబడి జీతం ఇవ్వకపోతే వారు ఎలా పనిచేస్తారు. అయినా మీరు ఏం చేస్తున్నారు. కార్మికుల జీతాల బిల్లులు చేసే తీరిక లేదా’’ అని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ స్థానిక పంచాయతీ కార్యదర్శి సావిత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ చిలమత్తూరులో పర్యటించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం, గ్రామ సచివాలయం, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని రికార్డులను తనిఖీ చేశారు. ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్‌)లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఎల్‌ఓలు, అధికార యంత్రాంగం ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాలను అందించాలని, ఓటర్లు వాటిని పూరించాక తిరిగి తీసుకోవాలన్నారు.

గోడు వెళ్లబోసుకున్న కార్మికులు..

కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ గ్రామ సచివాలయం వద్దకు వస్తున్నారన్న సమాచారంతో పంచాయతీ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్‌ రాగానే తమ గోడు వెళ్లబోసుకున్నారు. మూడు నెలలుగా పంచాయతీ కార్యదర్శి తమ జీతం బిల్లులు పెట్టడం లేదని వాపోయారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ కార్యదర్శి సావిత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కార్మికుల జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తనిఖీ..

అనంతరం స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌... రిజిస్ట్రేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌ల కోసం అదనంగా వసూలు చేయకూడదన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ హరికృష్ణ బాలాజీ, సబ్‌ రిజిస్ట్రార్‌ దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు.

చిలమత్తూరు కార్యదర్శి సావిత్రిని

ప్రశ్నించిన కలెక్టర్‌

పంచాయతీ కార్మికుల జీతాల

చెల్లింపులో అలసత్వంపై ఆగ్రహం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement