కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 13వ శతాబ్దం నుంచి దశలవారీగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఏటికేడు పెరుగుతూనే ఉంది. ఏటా ఆలయంలో నృసింహ జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్ల, వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్ల, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్ల, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకలు, వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా చేస్తారు. స్వామివారి దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేస్తుంటారు. కానీ ఇక్కడి సిబ్బంది భక్తులు ఆలయంలోనికి వెళ్లకముందే నిలువుదోపిడీ చేస్తున్నారు. డబ్బులున్నవారికి ఒక దర్శనం... పేదలకు ఒక రకమైన దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయంలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డుకు చేయి తడిపితే చాలు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరుగుతుందని భక్తులు చెబుతున్నారు.
లడ్డూలోనూ దోపిడీ..
ఖాద్రీశుని లడ్డూలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. దర్శనం అనంతరం లడ్డూలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లి బంధువులు, మిత్రులకు ప్రసాదంగా పంచిపెడతారు. అయితే లడ్డూల పేరుతోనూ ఆలయం సిబ్బంది భక్తుల జేబులకు చిల్లు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి స్వామివారి లడ్డులో ద్రాక్ష, గోడంబి, నెయ్యి, యాలకలు, జాజికాయ, కలకండ వాడుతారు. అందుకే స్వామివారి లడ్డూ చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇటీవల ఎలాంటి అదనపు దినుసులు లేకుండానే స్వామివారి లడ్డూలు తయారు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లడ్డూ తయారీ ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని కూటమి పార్టీల నాయకులే రెండు రోజుల క్రితం ఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దేవదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా ఆలయ నిర్వాహకుల్లో మార్పు కనిపించలేదు. వాస్తవానికి స్వామివారి చిన్న లడ్డూ రూ.15, పెద్దలడ్డూ రూ. 75 ప్రకారం భక్తులకు విక్రయించాలి. కానీ ఆలయ అధికారులు చిన్న లడ్డూ రూ.50, పెద్ద లడ్డూ రూ.100 చొప్పున విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
అభిషేకం నీళ్ల పేరుతో వ్యాపారం..
శ్రీదేవి, భూదేవి సమేత వసంతవల్లభునికి రోజూ ఉదయం 7.30 గంటల నుంచి 9.30 వరకు ఆలయంలో అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం నీళ్లతోనూ కొందరు వ్యాపారం చేస్తున్నారు. కేసరికి కలిపే పౌడరును నీటిలో కలిపి వాటిని ప్యాకెట్ రూ.50 నుంచి రూ.100 దాకా విక్రయిస్తూ భక్తులను దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
డబ్బులిస్తే దొడ్డి దారిలో దర్శనం..
ఆలయంలో పనిచేసే సెక్యూరిటీ, ఆలయ సిబ్బంది కొంత మంది కర్ణాటక భక్తులు వస్తే వారిని దర్శనం పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. డబ్బులు ఇస్తే తొందరగా దర్శనం చేయిస్తారని ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఆలయ పాలక మండలి, స్థానిక ప్రజాప్రతినిధి, దేవదాయ శాఖ అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. ఆలయ సిబ్బంది వ్యవహారంపై ఈఓ వి.శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా... విచారించి చర్యలు తీసుకుంటామని, భక్తులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు.
కదిరిలో వెలసిన లక్ష్మీనరసింహ స్వామిని భక్తులంతా ప్రేమతో ఖాద్రీశునిగా కొలుస్తారు. మహిమాన్వితుడైన స్వామి దర్శనం కోసం ఉమ్మడి తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా వస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ఆలయ సిబ్బంది.. భక్తులను
నిలువుదోపిడీ చేస్తున్నారు.
భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న
కొందరు సిబ్బంది
దర్శనం మొదలు అర్చన దాకా
అన్నింటికీ డబ్బే
చివరకు స్వామివారి లడ్డూలూ
అధిక ధరకు విక్రయం
అభిషేకం నీళ్లంటూ
ప్యాకెట్‌కు రూ.100 చొప్పున వసూలు
సిబ్బంది తీరుపై మండిపడుతున్న భక్తులు


