● ధర ఎక్కువ... విత్తనాలు తక్కువ
● విత్తన వేరుశనగపై ఆసక్తి చూపని రైతులు
కనగానపల్లి: రైతు సంక్షేమాన్ని విస్మరించి చంద్రబాబు సర్కార్...చివరకు సబ్సిడీ విత్తనం పేరుతో రైతును నిండా ముంచుతోంది. ఖరీఫ్‌లో వేరుశనగ సాగుచేసే రైతులకు చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయల పంపిణీని జిల్లాలో హడావుడిగా ప్రారంభించింది. అయితే విత్తనం నాసిరకంగా ఉండటంతో చాలా మంది రైతులు కొనుగోలు చేయడం లేదు. ఈ క్రమంలోనే నాలుగురోజుల క్రితం మండల కేంద్రమైన కనగానపల్లిలో విత్తన కాయల పంపిణీ ప్రారంభించగా...కొనేందుకు రైతులెవరూ రాలేదు. సాధారణంగా ప్రతి ఖరీఫ్ సీజన్‌లో మండలంలో 5 వేల క్వింటాళ్ల వరకు విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేస్తారు. ఈ సంవత్సరం కూడా తొలి విడతలో 2,500 క్వింటాళ్ల విత్తనం కావాలని మండల వ్యవసాయాధికారి మాధురి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో 5 రోజుల క్రితం కనగానపల్లిలో వ్యవసాయ గోదాముకు ఒక లారీ విత్తన వేరుశనగను సరఫరా చేశారు. అయితే విత్తన కాయలను గ్రేడింగ్ చేయకపోవటంతో పాటు కల్తీ కాయలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు కొనుగోలుకు ముందుకు రాలేదు. అయితే అదనులోనే విత్తనం వేయాలనుకున్న కొందరు రైతులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విత్తనాలే తీసుకువెళ్లారు.
గ్రేడింగ్ చేయలేదు
సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలను గ్రేడింగ్ చేయలేదు. కాయల్లో పుల్లలు, రాళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకే రకం కాయలు కాకుండా అన్ని రకాల కాయలు కలిపి పంపిణీ చేస్తున్నారు. కాయలు వలిస్తే విత్తనాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వాటినే తీసుకుపోతున్నాం. – సి. రవి, రైతు, కనగానపల్లి


