పుట్టపర్తి టౌన్: చెత్త తరలింపు వాహనాలకు మరమ్మతు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో అవి ఎండకు ఎండుతూ.. వానకు తుప్పుబడుతున్నాయి. పుట్టపర్తి మున్సిపాలిటీలో 20 వార్డుల్లో చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదేళ్ల క్రితం పుట్టపర్తి మున్సిపాటీకి రెండు వాహనాలు కొనుగోలు చేశారు. ఒక్కో వాహనం రూ.16 లక్షలు. నిర్వహణ లోపం కారణంగా 15 నెలల క్రితం మరమ్మతుకు గురయ్యాయి. ఒక కంఫ్యాక్టర్‌ను రెడీ చేసి మరోదాని మెకానిక్ షెడ్ వద్ద వదిలేశారు. అలాగే గతంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, దాతల సహాయంతో చెత్త తరలించేందుకు 10 ఆటోలను సేకరించారు. అందులో ఇప్పుడు మూడు మాత్రం పనిచేస్తున్నాయి. ఏడు వాహనాలు పనిచేయడం లేదు. వాటిని కూడా మెకానిక్ షెడ్ వద్ద నెలల తరబడి వదిలేశారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యురాలుగా కౌన్సిల్ సమావేశానికి హాజరై చెత్త సేకరణకు , పాత వాటిని మరమ్మతు చేయించాలని పదే పదే అధికారులను ఆదేశించినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. చెత్త సేకరణ వాహనాలకు మరమ్మతు చేయించలేదు. అవి మెకానిక్ షెడ్ వద్ద నెలల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నాయి. ఇప్పటికై నా ప్రత్యేక అధికారి, కమిషనర్ చెత్త తరలింపు వాహనాలపై దృష్టి పెట్టి ప్రజలు సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
చెత్త తరలింపు వాహనాల మరమ్మతును పట్టించుకోని అధికారులు
నెలల తరబడి ఎండలోనే
మగ్గుతున్న వాహనాలు


