లేపాక్షి: రూ.లక్షకు రూ.10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామంటూ ఎర వేసి చివరకు టాయ్ కరెన్సీతో మోసగిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను హిందూపురం పోలీసులు అరెస్ట్ చేశారు. లేపాక్షి పీఎస్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను హిందూపురం అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ ఆంజనేయులు వెల్లడించారు. చిలమత్తూరుకు చెందిన వెంకటేశ్, బాలాజీ, అదే మండలం లాలేపల్లికి చెందిన ఉపేంద్ర, అనంతపురానికి చెందిన చంద్రమోహన్, కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన నాగరాజు ముఠాగా ఏర్పడి.. టాయ్ కరెన్సీతో అమాయక ప్రజలను మోసం చేయాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడు వెంకటేశ్ తిరుపతికి చెందిన ప్రసాద్ ద్వారా అసలు నోట్లను పోలి ఉండే టాయ్ కరెన్సీని తెప్పించేవాడు. అనంతరం కొద్ది మొత్తంలో డబ్బిస్తే తాము భారీ మొత్తంలో చెల్లిస్తామని ఆశ చూపేవారు. డబ్బు చేతులు మారే సమయంలోనే వెంకటేశ్ డీఎస్పీగా, చంద్రమోహన్ ఎస్‌ఐ వేషధారణలో వెళ్లి బాధితులను భయపెట్టి అసలు నోట్లను లాక్కొనేవారు. వాహనానికి పోలీసు సైరన్‌తో పాటు పోలీసు డ్రెస్‌ను ధరించి భయభ్రాంతులకు గురి చేసేవారు. ముఠా గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం లేపాక్షి మండలం కొండూరు క్రాస్ వద్ద నిందితుల కదలికలను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వారి నుంచి రూ.50 లక్షల టాయ్ కరెన్సీ, ఒక లాఠీ, రెండు ఖాకీ టోపీలు, ఒక హ్యాండ్‌క్యాప్, డబ్బులు లెక్కించే మిషన్, మహేంద్ర స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతికి చెందిన ప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో హిందూపురం సీఐలు జనార్దన్, రాజగోపాల్ నాయుడు, కరీం, ఎస్‌ఐలు నరేంద్ర, శ్రీధర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రూ.లక్షకు రూ.10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామంటూ ఎర
‘టాయ్ కరెన్సీ’ అంటగట్టి మోసం
నిందితుల నుంచి రూ.50 లక్షల టాయ్ కరెన్సీ స్వాధీనం
కౌంటింగ్ మిషన్, స్కార్పియో వాహనం సీజ్


