పేలుడు పాపం ఎవరిది..? | - | Sakshi
Sakshi News home page

పేలుడు పాపం ఎవరిది..?

Apr 18 2026 9:17 AM | Updated on Apr 18 2026 9:17 AM

కదిరి: ఎవరో చేసిన పాపానికి నలుగురు అమాయకులు బలయ్యారు. సాయం చేద్దామని వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. అలాగే మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కదిరి పట్టణానికి కూత వేటు దూరంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఈ నెల 15న చోటు చేసుకున్న పేలుళ్ల ఘటన ఈ ప్రాంతం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన విశ్వనాథరెడ్డి(52), మూబున్నీసా(51), మధుసూదన్‌(35), అస్లాం(50) కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు. కుటుంబ యజమానులను కోల్పోయిన వారంతా భవిష్యత్‌ తలచుకుని శోకసంద్రంలో ఉండిపోయారు.

పేలుళ్లంటే గుర్తొచ్చేది వెంకన్నే

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కొత్తగూడెంకు చెందిన వెంకన్న కుటుంబం కొన్నేళ్లుగా కుమ్మరవాండ్లపల్లిలో జయరాం నాయక్‌ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటోంది. ఈ ప్రాంతంలో క్వారీల్లోనే కాకుండా పొలాలు, రోడ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా పెద్ద పెద్ద బండరాళ్లు పగలగొట్టాలంటే.. వెంటనే ఈ ప్రాంతవాసులకు గుర్తొచ్చేది వెంకన్న, ఆయన కుమారుడు సతీష్‌. వారికి ఫోన్‌ చేస్తే చాలు వెంటనే వచ్చి జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్ల సాయంతో పేలుళ్లు జరిపి బండరాళ్లు పగలగొడుతుంటారు. రాయి సైజును బట్టి డబ్బు తీసుకుంటారు.

పేలుడు పదార్థాల గురించి పోలీసులకు తెలియదా?

వెంకన్న ఉంటున్న ఇంట్లో ఎప్పుడూ జిలెటిన్‌ స్టిక్స్‌, డిటోనేటర్లతో పాటు ఇతర పేలుడు పదార్థాలు స్టాక్‌(నిల్వ) ఉంటాయనే విషయం ఈ ప్రాంత వాసులందరికీ తెలుసని స్థానికులు చెబుతున్నారు. మరి ఈ విషయం పోలీసులకు తెలియదంటే నమ్మశక్యంగా లేదని వారంటున్నారు. తరచూ కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ పేరుతో సోదాలు చేసే పోలీసులకు ఆ ఇంట్లో పేలుడు పదార్థాలు కనిపించలేదా? అని కొందరు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి పోలీసు సిబ్బంది కొందరు తరచు వెంకన్న ఇంటివద్దకే వచ్చి మామూళ్లు తీసుకొని వెళ్తుంటారని, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లోని కొందరు పోలీసు అధికారులకు కూడా అందులో వాటా వెళ్తుందని ఆరోపిస్తున్నారు. ఇందులో ఎవరి పాపం ఎంతో..తెలియదు గానీ, దీనికి పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు కమ్యూనిస్ట్‌ పార్టీల నాయకులు పేర్కొంటున్నారు.

వెంకన్న కుటుంబంపై కేసు నమోదు

పేలుళ్లకు కారణమైన వెంకన్నతో పాటు ఆయన కుమారుడు సతీష్‌పై కదిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) 2023లోని సెక్షన్‌ 105 కింద వారిపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్‌ గతంలో ఉన్న ఐపీసీ సెక్షన్‌ 304కు సమానం. చంపాలనే ఉద్దేశం లేకపోయినా ప్రాణహాని కలిగిస్తుందని తెలిసీ చేసే పనుల వల్ల మరణం సంభవిస్తే ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం నిందితుడు వెంకన్న పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

కుమ్మరవాండ్లపల్లి ఘటనలో

అన్నీ అనుమానాలే

పేలుడు పదార్థాల నిల్వ గురించి పోలీసులకు తెలియదా?

మరి కార్డెన్‌ సెర్చ్‌లు ఎందుకు చేశారంటున్న స్థానికులు

ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న ప్రతిపక్షాలు

Advertisement
 
Advertisement
Advertisement