‘తమ్ముళ్ల’ స్వార్థం... చిత్రావతి ఛిద్రం
పుట్టపర్తి అర్బన్: వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిత్రావతి రూపరేఖలు కోల్పోతోంది. సత్యసాయి బాబా నడయాడిన నది కాస్త టీడీపీ నేతల వికృత చేష్టలతో చరిత్ర పుటల్లో ఓ కలగా మారనుంది. అపర భగీరథుడుగా ఖ్యాతి గాంచిన భగవాన్ సత్యసాయి బాబా చిత్రావతి నదిలో సంచరించే సమయంలో ఎటు చూసినా ఇసుక తిన్నెలు ఉండేవి. దీంతో పుట్టపర్తి సందర్శనకు వచ్చే దేశవిదేశీ భక్తులు పండు వెన్నెల్లో చిత్రావతి నదిలో విహరిస్తూ సత్యసాయి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ స్థానిక ప్రజాప్రతినిధులు నదీపరివాహక ప్రాంతం నుంచి ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించడం పరిపాటిగా మారింది. దీంతో గతమెంతో ఘన చరిత్ర కలిగిన నదీ పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం ఇసుక కనుమరుగైంది. జంతువుల కళేబరాలు, ఎముకలు, పుర్రెలతో పాటు మురుగు నీరు చేరి నది వాతావరణం పూర్తిగా కలుషితమైపోయింది.
నిలువెల్లా గాయాలు
పుట్టపర్తి పట్టణ సమీపంలోని చిత్రావతి నదిలో చెక్‌డ్యాం నిర్మాణంతో వర్షపు నీళ్లు నిలిచాయి. చెక్‌డ్యాం దిగువ ప్రాంతంలో టీడీపీ నేతలు ఇసుక అక్రమ తరలింపులు చేపట్టారు. ఇక స్థానికంగా చేపట్టిన నిర్మాణాలకు చిత్రావతి నది ఇసుకనే వినియోగిస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతమంతా లోతైన గోతులు ఏర్పడ్డాయి. ప్రమాదవశాత్తు ఎవరైనా పర్యాటకులు ఆ గోతుల్లో పడితే బయట పడేది కష్టమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పుట్టపర్తి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి డ్రైనేజీ నీటిని నదిలోకి వదిలేస్తుండడంతో నది పరివాహక ప్రాంతంలో భారీగా మురుగు నీరు చేసి దుర్వాసన వెదజల్లుతోంది. నదికి ఇరువైపులా ఉన్న హోటళ్లు, ఇళ్లు, చిరు వ్యాపారులు, మెకానిక్‌లు, కూరగాయల మార్కెట్‌లో సంతలు ఏర్పాటు చేసుకునే వ్యాపారులు తదితరులంతా నదిలోకి వ్యర్థాలను వేసి కలుషితం చేస్తున్నారు. వీటితో పాటు భవనాల శిథిలాలను సైతం నదిలోనే పడేసి ఆక్రమిస్తుండడంతో పరివాహక ప్రాంతం కుంచించుకుపోతోంది. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, అట్టపెట్టెలు, జంతువుల కళేబరాలను సైతం నదిలోనే పడేస్తున్నారు. నదికి ఇరువైపులా వ్యవసాయ భూములతో పాటు కర్ణాటక నాగేపల్లి, రాయలవారిపల్లి, కోవెలగుట్టపల్లి, ఎనుములపల్లి, పెద్ద కమ్మవారిపల్లి, సాయినగర్ తదితర గ్రామాల రైతులకు సంబంధించిన బోరు బావులకు విద్యుత్ కనెక్షన్ల కోసం నదిలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు కాస్త ఇసుక అక్రమ తరలింపులతో ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడు కూలుతాయో చెప్పలేని పరిస్థితి.
టీడీపీ నేతల వికృత చర్యలతో
నదీ పరివాహక ప్రాంతం కళావిహీనం
ఇసుక తరలింపులతో
ప్రమాదపుటంచున విద్యుత్ స్తంభాలు
మురుగు నీరు, జంతువుల కళేబరాలతో వాతావరణం కలుషితం
అవగాహన కల్పిస్తున్నాం
చిత్రావతి నది వెంబడి ఇరువైపులా చెత్తా చెదారం వేయకుండా స్థానికులకు, హోటళ్ల యజమానులకు అవగాహన కల్పిస్తున్నాం. అయినా ఏదో ఒక సమయంలో నదిలో చెత్త పడేస్తున్నారు. దీనిని నివారించేందుకు నది గట్టుపై పూల మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపడతాం.
– క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్, పుట్టపర్తి
చర్యలు తీసుకుంటాం
చిత్రావతి నది వెంబడి వ్యవసాయ బావులకు ఏర్పాటు చేసిన విద్యుత స్తంభాలు ప్రమాదకరంగా ఉండడం వాస్తవం. ఇసుకను తరలించకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాం. పడిపోయే విధంగా ఉన్న స్తంభాలను గుర్తించి వాటిని పటిష్ట పరుస్తాం.
– శివరాములు, డీఈ, విద్యుత్ శాఖ
ప్రమాదకరంగా ఉన్నాయి
బోరు బావుల కోసం చిత్రావతి నది వెంబడి ఏర్పాటు చేసుకున్న విద్యుత్ స్తంభాల చుట్టూ ఉన్న ఇసుకను తోడేయడంతో స్తంభాలు ప్రస్తుతం కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. విద్యుత సరఫరా సమయంలో తీగలు నది నీటిలో పడితే జరిగే ప్రమాద తీవ్రత తలుచుకుంటే భయమేస్తోంది. గత ఆరు నెలలుగా ఇసుకను భారీగా తోడేస్తుండడమే ఇందుకు కారణం. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపులు అడ్డుకుని విద్యుత్ స్తంభాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
– తిప్పారెడ్డి, రైతు, కర్ణాటకనాగేపల్లి
‘తమ్ముళ్ల’ స్వార్థం... చిత్రావతి ఛిద్రం


