అనుమానం పెనుభూతమై..
అనుమానమే పెనుభూతమైంది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న భార్య తలపై మచ్చుకత్తితో నరికి కడతేర్చాడో కిరాతకుడు. తనలో సగభాగమైన భార్యను చేతులారా చంపుకున్నాడు.
రాయదుర్గం టౌన్: భర్తే కాలయముడిగా మారి భార్యను నరికి హతమార్చిన ఘటన రాయదుర్గంలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు... స్థానిక ముత్తరాసి కాలనీలో నివాసముంటున్న ఆంజనేయులు కుమార్తె కుళ్లాయమ్మ (45)కు పాతికేళ్ల క్రితం అనంతపురానికి చెందిన మారెన్నతో వివాహమైంది. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని మారెన్న పోషించుకునేవాడు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు.
తరచూ గొడవనే
బంగారం లాంటి ఇల్లాలు, రత్నాల్లాంటి బిడ్డలు ఉన్నప్పటికీ.. మూడు నెలలుగా కుళ్లాయమ్మ ప్రవర్తనపై మారెన్న అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ ఆమెతో గొడవ పడేవాడు. భార్య ఎంత నచ్చచెబుతున్నా వినేవాడు కాదు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో నాలుగు రోజుల క్రితం ఆమె రాయదుర్గంలోని తన పుట్టింటికి చేరుకుంది. దీంతో మంగళవారం రాత్రి మారెన్న కూడా రాయదుర్గానికి వచ్చాడు. మారెన్నలో మార్పు వచ్చిందని అత్తింటి వారు సంతోష పడ్డారు. అల్లుడికి రాచమర్యాదలే చేశారు. అనుమానాలు వీడి కుమార్తెను చక్కగా చూసుకోవాలని హితవు పలికారు. ఆ రోజు రాత్రి మారెన్న తన భార్యతో కలసి ఆమె ఇంట్లోనే నిద్రించాడు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కుళ్లాయమ్మను కదిపి చూశాడు. ఆమె కూడా గాఢ నిద్రలో ఉన్నట్లుగా నిర్ధారించుకున్న అనంతరం మచ్చుకత్తి తీసుకుని తలపై నరికి అక్కడి నుంచి పరారయ్యాడు.
చికిత్స పొందుతూ...
ఇంటి తలుపులు తీసిన శబ్ధానికి కుళ్లాయమ్మ కుటుంబసభ్యులు మేల్కొన్నారు. అల్లుడు హడావుడిగా బయటకు వెళుతుంటే వారికి అర్థం కాలేదు. కాసేపటి తర్వాత కుమార్తె గదిలోకి వెళ్లారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకున్న కుళ్లాయమ్మను గమనించి అల్లుడు ఎంత పనిచేశాడంటూ ఆక్రోశం వెళ్లగక్కుతూ ఆగమేఘాలపై 108 అంబులెన్స్‌లో రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కుళ్లాయమ్మ మృతి చెందింది. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హత్యకు గల కారణాలను బాధిత కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
భార్యను నరికి చంపిన భర్త
రాయదుర్గంలో దారుణం


