తాడిపత్రిలో మాతృ మరణం
తాడిపత్రి రూరల్: ప్రైవేట్ ఆస్పత్రిలో మాతృమరణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండల కేంద్రానికి చెందిన లావణ్య (27), ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడైన పుట్లూరు మండలం కుమ్మనమలకు చెందిన శరత్‌బాబు దంపతులు. లావణ్య గర్భం దాల్చింది. ఆమెకు తాడిపత్రిలోని కృష్ణాపురం మూడవ రోడ్డులో గల నిహిర నర్సింగ్ హోంలో వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండటంతో మంగళవారం స్వగ్రామం నుంచి నర్సింగ్‌హోంలో చేర్చారు. సాధారణ ప్రసవం కష్టమని, సిజేరియన్ చేయాల్సి ఉందని వైద్యురాలు తెలిపారు. బుధవారం ఉదయం సిజేరియన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ గర్భసంచికి రంధ్రం ఏర్పడి రక్తస్రావం మొదలైంది. వైద్యురాలు పరిశీలించి.. లావణ్యకు మూడు బాటిళ్ల రక్తం ఎక్కించారు. అయినా పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లాలని సిఫార్సు చేశారు. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే లావణ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహించి మృతదేహాన్ని అంబులెన్సులో తాడిపత్రికి తీసుకొచ్చి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సిజేరియన్ సమయంలో జరిగిన నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయని, డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారుల వద్దకు వచ్చి.. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు శాంతించారు. ఇదిలా ఉండగా లావణ్య ప్రసవించిన మగ శిశువు ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
తాడిపత్రిలో మాతృ మరణం


