మహిళతో హోంగార్డు అసభ్య ప్రవర్తన
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లి వేమన ఆలయంలో విధుల నిర్వర్తిస్తున్న హోంగార్డు రాజు బుధవారం తెల్లవారుజామున ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో మహిళ కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని హోంగార్డును పట్టుకుని దేహశుద్ధి చేయడం చర్చనీయాంశమైంది. ఇలాంటి వారి వల్లనే పోలీసు శాఖ అప్రతిష్ట పాలవుతోందని స్వయంగా పేర్కొన్న పోలీసులే ఈ అంశం వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టడం గమనార్హం. అంతేకాక, ఇదే అంశంపై కటారుపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేపట్టారు. ఈ విషయంపై స్ధానిక ఎస్‌ఐ సుమతిని వివరణ కోరగా అలాంటి ఘటనలు ఏమీ జరగలేదని చెప్పడం కొసమెరుపు.
దాడి కేసులో
నిందితుడి అరెస్ట్
లేపాక్షి (హిందూపురం): ఈ నెల 19న లేపాక్షి మండలం పి.సడ్లపల్లి గ్రామంలో యువకుడిపై కొడవలితో దాడి చేసిన కేసులో నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూపురంలోని డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐలు జనార్ధన్, రాజగోపాలనాయుడు, ఎస్‌ఐ నరేంద్రతో కలసి డీఎస్పీ మహేష్ వెల్లడించారు. ఈ నెల 19వ తేది రాత్రి సడ్లపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్.. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌పై కొడవలితో దాడి చేయడంతో తీవ్ర రక్త గాయాలయ్యాయి. బాధితుడి తండ్రి నాగభూషణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన లేపాక్షి పోలీసులు.. బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో సడ్లపల్లి నుంచి తిలక్‌నగర్‌కు వెళ్లే క్రాస్ వద్ద తచ్చాడుతున్న సాయికుమార్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. కొడవలిని స్వాధీనం చేసుకుని న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
ఏపీఈసెట్ కన్వీనర్‌గా దుర్గాప్రసాద్
అనంతపురం: ఏపీ ఈసెట్ –2026 నిర్వహణ బాధ్యతను దక్కించుకున్న జేఎన్‌టీయూ(ఏ)... సెట్ కన్వీనర్‌గా మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్‌ను నియమించింది. దీంతో బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను ఏపీ ఈసెట్ చైర్మన్, వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అభినందించారు. కాగా, ఏపీఈసెట్ నిర్వహణ బాధ్యతను పదో దఫా జేఎన్‌టీయూ (ఏ)కు అప్పగించడం విశేషం. ఏడు దఫాలు ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, ఒకసారి ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మెన్‌గా ఉన్న ప్రొఫెసర్ సి.శశిధర్ కన్వీనర్‌గా వ్యవహరించారు. ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ రెండో సారి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
విసిరేసిన మాతృత్వం..
గుత్తి: ఓ మహిళ నవమాసాలు మోసి కన్న ముక్కుపచ్చలారని కుమార్తెను మానవత్వం మరిచి ఓ ఇంటి గడప వద్ద వదిలి వెళ్లిన ఘటన గుత్తి పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుత్తిలోని కుంట కట్ట వద్ద నివాసముంటున్న మైనుద్దీన్ ఇంటి ఎదుట బుధవారం ఉదయం ఓ ప్లాస్టిక్ కవర్‌లో నవజాత ఆడశిశువు కనిపించింది. తల్లి గర్భం నుంచి బయటపడే సమయంలో దేహానికి అంటిన రక్తపు మరకలు కూడా అలాగే ఉన్నాయి. అప్పటికే స్థానికులు గుమికూడారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ నాగమాణిక్యం, సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ప్రాణముందన్న ఆశతో ఆగమేఘాలపై ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు నిర్దారించారు. అయితే శిశువును ఎవరు వదిలి వెళ్లారో తెలియడం లేదు. ఈ ఘటనపై సీఐ రామారావు, సీడీపీఓ యల్లమ్మ, సూపర్‌వైజర్ రాజేశ్వరి, 1098 సిబ్బంది లోతుగా విచారణ చేపట్టారు. ఒకవేళ శిశువు ముందే మృతి చెంది ఉంటే మానవత్వంతో ఖననం చేయడమో లేక, ఇష్టం లేకపోతే నిర్మానుష్య ప్రాంతంలోనో పడేసేవారు. ప్రాణముండడంతో ఎవరైనా తీసుకెళ్లి పెంచుకుంటారనే ఆశతోనే ఓ ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి ఊపిరి ఆడేలా కవర్ మూత తీసి పెట్టి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మృత శిశువును గుత్తి ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు.
మహిళతో హోంగార్డు అసభ్య ప్రవర్తన
మహిళతో హోంగార్డు అసభ్య ప్రవర్తన


