పరిగిలో ఉద్రిక్తత
పరిగి: ప్రమాదవశాత్తు కారు ఢీకొని మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధితులు ఆందోళనకు సిద్ధం కావడంతో పరిగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు.. రొద్దం మండలం చోళేమర్రి గ్రామానికి చెందిన ఉప్పర రామాంజప్ప మంగళవారం సాయంత్రం చిన్నపల్లి క్రాస్ వద్ద చోటు చేసుకునప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతికి కారణమైన కారు మడకశిర ప్రాంతానికి చెందిన వ్యక్తిదని గుర్తించిన బాధిత కుటుంబసభ్యులు... పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో మడకశిరకు చేరుకుని సదరు వ్యక్తి ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హిందూపురం ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకుని వాహనాల్లో బయలుదేరి బుధవారం సాయంత్రం పరిగి చెరువు కట్ట వద్దకు చేరుకోగానే విషయం తెలుసుకున్న డీఎస్పీ నరసింగప్ప నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులతో బాధిత కుటుంబసభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా అన్యాయం చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు వాదించారు. డీఎస్పీ కలగజేసుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసానివ్వడంతో శాంతించారు.


