టిడ్కో ఇళ్ల పంపిణీ ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

టిడ్కో ఇళ్ల పంపిణీ ఎప్పుడో?

Nov 10 2025 7:22 AM | Updated on Nov 10 2025 7:22 AM

టిడ్క

టిడ్కో ఇళ్ల పంపిణీ ఎప్పుడో?

ఏడాదిన్నరగా పట్టించుకోని ప్రభుత్వం

పుట్టపర్తి అర్బన్‌: టిడ్కో ఇళ్ల నిర్మాణాల పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అరకొర సంపాదనతో కుటుంబ పోషణకే ఇబ్బంది పడుతున్న పేదలు.. ఇళ్ల అద్దెలు చెల్లించలేక సతమతమవుతున్నారు. తమ సొంతింటిలోకి ఎప్పుడు అడుగు పెడతామా అని ఏడెనిమిదేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయినా ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. 2014 – 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు పక్కాగృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చింది. టిడ్కో (ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా 2019 నాటికి అన్ని హంగులతో ఇళ్లు నిర్మించి ఇస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పింది.

మధ్యలోని ఆగిన నిర్మాణాలు

జిల్లాలోని కదిరి, పెనుకొండ, ధర్మవరం, హిందూపురం, మడకశిర, పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు భూములు కేటాయించారు. ఇందులో పుట్టపర్తి మున్సిపాలిటీలోని పేదల కోసం సమీపంలోని కర్ణాటకనాగేపల్లి వద్ద నల్లమాడ–పుట్టపర్తి ప్రధాన రోడ్డు పక్కన దాదాపు 28 ఎకరాల విస్తీర్ణంలో భూమి చదును చేసి బ్లాకులుగా నిర్మాణం మొదలు పెట్టారు. 15 బ్లాకుల (జీ + 3, జీ+4)కు గాను 5 బ్లాకుల నిర్మాణాలు మాత్రమే పూర్తి చేశారు. ఆ తర్వాత బిల్లులు అందలేదని కాంట్రాక్టర్‌ తక్కిన పనులు నిలిపివేశారు. ఇక్కడ నిర్మాణాలు పూర్తయితే 1,248 లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాల్సి ఉంది.

డిపాజిట్లు ఇలా..

టిడ్కో ఇళ్ల నిర్మాణాను మూడు కేటగిరీలుగా విభజించారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటికి రూ.500 చొప్పున 467 మందితో, 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటికి రూ.12,500 చొప్పున 93 మందితో, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఇంటికి రూ.25వేల చొప్పున 112 మందితో మొత్తం 672 మంది నుంచి మున్సిపల్‌ అధికారులు డిపాజిట్లు సేకరించారు. అప్పట్లో ఈ ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.68.70 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు ఆ ఇళ్లను పూర్తి చేయాలంటే రూ.వంద కోట్లు దాటుతుందని అంచనా.

అసాంఘిక శక్తులకు అడ్డాగా..

పుట్టపర్తి సమీపంలోని టిడ్కో గృహ నిర్మాణ సముదాయాలు పూర్తి కాకపోవడంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతున్నాయి. రోజూ సాయంత్రమైతే చాలు మందుబాబులు అక్కడకు చేరుకుని పూటుగా తాగుతున్నారు. మద్యం మత్తులో ఏమి అఘాయిత్యాలకు పాల్పడతారోనని అటువైపు పొలాలకు వెళ్లే మహిళలు బిక్కుబిక్కుమంటున్నారు.

త్వరలోనే పూర్తి చేస్తాం

దీనిపై పుట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి కుమార్‌ను వివరణ కోరగా మూడు రోజుల క్రితం మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణతో టెలీ కాన్ఫరెన్స్‌ జరిగిందని, త్వరలోనే కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు చెల్లించి తక్కిన పనులను పూర్తి చేసే విధంగా హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం మొదటి విడతలో పెద్ద మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేస్తారని, ఆ తర్వాత చిన్న మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేస్తారని చెప్పినట్లు కమిషనర్‌ చెప్పారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణం ఇలా..

టిడ్కో ఇళ్లన్నీ మోనోలిథిక్‌ కాంక్రీట్‌ టెక్నాలజీ సహాయంతో ఇటుకలు లేకుండా నిర్మిస్తారు. ఒక హాలు, వంట గది, బెడ్‌రూం ఉంటాయి. ఈ ప్రాజెక్టులో ఇళ్లతో పాటు రహదారులు, డ్రెయినేజీ, పాఠశాల, వ్యాపార సంస్థలు, ఆరోగ్య కేంద్రం, సౌర విద్యుత వీధి దీపాలు, 24 గంటలూ విద్యుత్‌ సౌకర్యం ఉండేలా చూస్తారు. అప్పట్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన టిడ్కో ఇళ్లను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర గడుస్తోంది. అయినా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తి కాలేదు. లబ్ధిదారులు మాత్రం తరచూ మున్సిపాలిటీలకు వెళ్లి అధికారులను కలుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.

టిడ్కో ఇళ్ల పంపిణీ ఎప్పుడో? 1
1/1

టిడ్కో ఇళ్ల పంపిణీ ఎప్పుడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement