
జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం
ప్రశాంతి నిలయం: ‘‘ జిల్లా సమగ్రాభివృద్ధే నా లక్ష్యం. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ముందుకు సాగుతాం. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందేలా చేస్తాం. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ప్రాధాన్యం ఇస్తూ అన్ని రంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతా’’ అని జిల్లా నూతన కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడారు. తాను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చానని తెలిపారు. తన కుమార్తె విద్యాభ్యాసం సత్యసాయి విద్యాసంస్థల్లో సాగిందని, అందువల్ల జిల్లాపై తనకు సమగ్ర అవగాహన ఉందన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. పరిశుభ్రత, నీటి సరఫరా, విద్యుత్, జల సంరక్షణ, ఆరోగ్యం, విద్య తదితర ప్రధానమైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకు సాగుతాం
అర్హులకు పథకాలు అందిస్తాం... పౌరసేవలు వేగవంతం చేస్తాం
జిల్లా నూతన కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్
వైభవంగా బాబా శత జయంత్యుత్సవాలు
సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని నూతన కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ రామసుబ్బయ్య, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి చేరుకున్న కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు సాయికుల్వంత్ సభా మందిరంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ ఎం.రామసుబ్బయ్య, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, శర్మ, ఆనంద్‌కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ సాయికుల్వంత్ సభా మందిరానికి వెళ్లి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం