
ప్రతి మహిళకూ వైద్య సేవలు అందాలి : జేసీ
పుట్టపర్తి అర్బన్: ప్రతి మహిళకూ వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ ఆదేశించారు. స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగంతో కలసి ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, సీ్త్ర సంబంధిత అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, మందులు అందజేయాలన్నారు. అలాగే ఆభా కార్డ్‌లు (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్), పీఎంజేఏవై కార్డుల నమోదు ప్రక్రియ జరగాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మంజువాణి, డాక్టర్ నాగేంద్రకుమార్, డాక్టర్ సునీల్, ఎన్టీఆర్ వైద్య సేవ అధికారి డాక్టర్ శ్రీదేవి, డీపీహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డెమో బాబాఫకృద్దీన్, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నెల రోజుల పాటు ‘పోషణ్ మహా’..
పోషకాహార ప్రాధాన్యతపై ప్రజలను చైతన్య పరిచాలని ఐసీడీఎస్ సిబ్బందిని జేసీ అభిషేక్‌కుమార్ ఆదేశించారు. నెల రోజుల పాటు పోషన్ మహా కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీ ప్రమీలతో కలసి బుధవారం పుట్టపర్తి మండలం ఎనుములపల్లి పీహెచ్‌సీ ప్రాంగణంలో పోషన్ మహా కార్యక్రమాలను ఆయన ప్రారంభించి, మొక్క నాటి నీరు పోశారు. మాతృవందన యోజనపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలు పలు రకాల ఆహార పదార్థాలను తీసుకొచ్చి ప్రదర్శించారు. వాటిలోని పోషక విలువలను గర్భిణులకు, బాలింతలకు వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నీలో గురుకుల విద్యార్థుల సత్తా
రొళ్ల: తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న జీసీసీ (గుమ్మడి క్రికెట్ గ్రౌండ్) వేదికగా స్కూల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 15, 16వ తేదీల్లో జరిగిన 6వ జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీలో రొళ్ల మండలం దొమ్మరహట్టిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 15 మంది క్రీడాకారులున్న ఏపీ జట్టులో 9 మంది గురుకుల పాఠశాల విద్యార్థులే ఉండడం గమనార్హం. ఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ జట్టుతో తలపడిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులు చేసింది. తర్వాత బరిలో దిగిన తెలంగాణ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 110 పరుగుల వద్ద చతికిలపడింది. 3 పరుగుల తేడాతో ఆంధ్ర జట్టు విజయం సాధించింది. ఆంధ్ర జట్టు తరపున విజేత ట్రోఫీని కెప్టెన్ మనోహర్, వైస్ కెప్టెన్ వరుణ్‌సందేష్ అందుకున్నారు. ప్రతిభ చాటిన గురుకుల పాఠశాల విద్యార్తులు బుధవారం సాయంత్రం ఎంఈఓ శ్రీధర్, ప్రిన్సిపాల్ మైలారప్ప, చైర్మన్ సుమతో పాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

ప్రతి మహిళకూ వైద్య సేవలు అందాలి : జేసీ