
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
పెనుకొండ: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ సూచించారు. పెనుకొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను బుధవారం సీపీఎం నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలనుకోవడం అవివేకమన్నారు. 2023లో గత ప్రభుత్వం పెనుకొండలో వైద్య కళాశాల భవన నిర్మాణాలను చేపట్టి రూ. 30 కోట్ల మేర ఖర్చు పెట్టిందని, ఇలాంటి తరుణంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతమైన పెనుకొండలో సత్వరం మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పెనుకొండలో మెడికల్ కళాశాల ఏర్పాటైతే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. అదే ప్రైవేట్ పరమైతే ఫీజుల భారం పడుతుందన్నారు. వైద్య సేవలు అత్యంత ఖరీదుతో కూడుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను వీడి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగాధర్, వెంకటరాముడు, సీఐటీయూ జిల్లా నాయకుడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్