
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం
పెనుకొండ: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్, కార్యదర్శులు లక్ష్మీరాజా, శెట్టిపి జయచంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ యూటీఎఫ్ చేపట్టిన రణభేరి కార్యక్రమం కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా బుధవారం పెనుకొండకు చేరింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్‌తో కలసి యూటీఎఫ్ నాయకులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఒకటిన్నర ఏడాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. పీఆర్‌సీని నియమించడంతో పాటు 30 శాతం ఐఆర్‌ను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు డీఏలు, రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు, 11వ పీఆర్‌సీ, అరియర్స్, పీఎఫ్ చెల్లింపులు చేయాలన్నారు. ఈ నెల 25న గుంటూరులో తలపెట్టిన రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు నారాయణస్వామి, నబీ, నరేష్, భూతన్న, జీహెచ్ బాబు, మారుతి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, నరసింహప్ప, మహంతేష్, రామకృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్‌కుమార్