
ప్రైవేటీకరణం
పెనుకొండ రూరల్/పరిగి: వైద్యో నారాయణో హరి అన్నారు. ఆపద సమయంలో ప్రాణం పోసే వాడు దేవుడితో సమానం. అందుకే పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న ఏకై క లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజ్‌ల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగానే పెనుకొండ పట్టణం సమీపంలో 63 ఎకరాల్లో రూ.470 కోట్ల అంచనాలతో మెడికల్ కాలేజీ నిర్మాణానికి 2021 మే 31న శంకుస్థాపన చేశారు. మెడికల్ కళాశాలతో పాటు అన్ని వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల వివిధ అభివృద్ధి పనులకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కళాశాల భవన నిర్మాణాల కోసం దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిన్నర కాలంలోనే నిరుపేదలకు వైద్య సేవలను దూరం చేసింది. మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యాన్ని నీరు గారుస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరగనుంది. తొలివిడతలో 5 కాలేజీలను ప్రైవేటుపరం చేసింది. మలివిడతలో పెనుకొండ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్ధమైంది.
పీపీపీ విధానాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగానే శుక్రవారం చలో మెడికల్ కాలేజీకి పిలుపునిచ్చింది. ఉదయం 9–30 గంటలకు పెనుకొండ పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన నలభైఏళ్ల రాజకీయ జీవిత కాలంలో ఏనాడూ ప్రభుత్వ అనుకూల వ్యవస్థలను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎలాంటి వ్యవస్థనైనా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, తన స్వార్థ ప్రయోజనాలకే రాష్ట్రాభివృద్ధిని తాకట్టుపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం పెనుకొండలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో పాటు పలువురు కోఆర్డినేటర్లు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై
వైఎస్సార్‌సీపీ నిరసన బాట
నేడు ‘చలో మెడికల్ కాలేజీ’కి పిలుపు
విజయవంతం చేయాలని
మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపు
నేడు వైఎస్సార్‌సీపీ ‘చలో మెడికల్ కాలేజీ’

ప్రైవేటీకరణం