పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో గురువారం కూడా జిల్లాలోని 29 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చిలమత్తూరు మండలంలో 87.2 మి.మీ, లేపాక్షి 70.2, హిందూపురం 48.6, ఓడీ చెరువు 48.4, గాండ్లపెంట 42, నల్లచెరువు 34.2, ఎన్‌పీ కుంట 32.2, గోరంట్ల 32.2, ముదిగుబ్బ 26.4, పరిగి 26.2 మి.మీ వర్షం కురిసిందన్నారు. అలాగే కదిరిలో 22 మి.మీ, రొళ్ల 16.4, తనకల్లు 15.8, అమడగూరు 15.2, బుక్కపట్నం 15, కొత్తచెరువు 12, నల్లమాడ 9.8, అగళి 9.6, తలుపుల 8.4, మడకశిర 6.8, పుట్టపర్తి 6.4, పెనుకొండ 5.4, సోమందేపల్లి 4.8, సీకే పల్లి 4.6, అమరాపురం 3.8, ధర్మవరం 3.4, గుడిబండ 2.6, తాడిమర్రి 2.2, రొద్దంలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో మొత్తం 613.4 మి.మీ వర్షం కురిసిందని వెల్లడించారు. తుపాను ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందన్నారు.
విష జ్వరంతో విద్యార్థి మృతి
ముదిగుబ్బ: ముదిగుబ్బ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షేక్ మహమ్మద్ షాహీద్ (13) విషజ్వరంతో గురువారం మృతి చెందినట్లు ప్రధానోపాధ్యాయుడు రాఘవ తెలిపారు. షాహీద్ నెలరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయిందని తండ్రి బాబ్‌జాన్ కన్నీటి పర్యంతమయ్యారు. విష జ్వరంతో చనిపోయాడా? లేక డెంగీ లక్షణాలు ఉన్నాయా అని వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. విద్యార్థి మృతికి ఉపాధ్యాయులు, విద్యార్థులు నివాళులర్పించారు.
నలుగురికి రిమాండ్
కదిరి అర్బన్: గత నెల 27న కుటాగుళ్ల గ్రామంలో జరిగిన పరస్పర దాడులకు సంబంధించి నమోదైన కేసులో నలుగురిని గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. గొడవల అనంతరం ఆస్పత్రిలో వైద్యులపై దాడులకు పాల్పడిన ఘటనలో 3 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. మొత్తం 12 మందిపై కేసులు నమోదు చేయగా, గతంలోనే 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని, తాజాగా నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
బార్ టెండర్లలో సిండికేటు
సాక్షి, పుట్టపర్తి: నూతన మద్యం పాలసీ ద్వారా బార్‌లకు లైసెన్సులు ఇచ్చి.. మరింత ఆదాయం పెంచాలని భావించిన కూటమి సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడేలా కూటమి పార్టీల నాయకులు సిండికేటుగా మారి దరఖాస్తులు వేయనీయకుండా అడ్డుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో మొత్తం 12 బార్ లకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తొలివిడతలో ఏడింటికి దరఖాస్తులు వచ్చాయి. లాటరీ పద్ధతిన గడిచిన నెలలో బార్లు కేటాయించారు. పెండింగులో ఉన్న మిగతా వాటికి రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేశారు. మరో మూడు బార్‌లకు మాత్రమే పరిమితంగా దరఖాస్తులు వచ్చాయి. ఇంకో రెండు బార్‌లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. రెండో విడత నోటిఫికేషన్‌లో మూడు బార్లను కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా గురువారం లాటరీ తీసి ఎంపిక చేశారు. .
ఒక్కో వ్యక్తి నాలుగు సెట్లు..
హిందూపురంలోని బార్‌కు ఒక్క వ్యక్తే నాలుగు సెట్లు దాఖలు చేశాడు. దీంతో ఆయన్నే ఎంపిక చేశారు. అలాగే మడకశిరలోనూ ఒకే వ్యక్తి నాలుగు సెట్లు దరఖాస్తులు చేయడం విశేషం. కదిరిలోని బార్‌కు ఒక వ్యక్తి మూడు సెట్‌లు, మరో వ్యక్తి ఒక సెట్ దాఖలు చేయగా.. సక్సెస్‌ఫుల్ అప్లికెంట్‌గా ఒకరు.. ఆర్1గా ఇంకొకరికి అవకాశం లభించింది. ధర్మవరంలోని రెండు బార్‌లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అయితే గతంలో జిల్లాలో 9 బార్లు మాత్రమే ఉండేవి. ఈసారి ఇప్పటికే 10 బార్‌లు వెలిశాయి. ఇంకో రెండు పెండింగులో ఉన్నాయి. అయితే అన్ని చోట్ల సిండికేటుగా మారడంతో అందరూ కలిసే దరఖాస్తులు వేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నాలుగు కంటే తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ రద్దు చేస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోవిందనాయక్ తెలిపారు. సరిపడా దరఖాస్తులు రాని రెండు బార్‌లకు మరోసారి రీనోటిఫికేషన్ ఇస్తామన్నారు.
29 మండలాల్లో వర్షం
29 మండలాల్లో వర్షం