
ఎలుగుబంట్ల దాడిలో కాపరికి తీవ్ర గాయాలు
రొళ్ల: మేక పిల్లల కోసం మేత కోస్తుండగా హఠాత్తుగా రెండు ఎలుగుబంట్లు దాడి చేయడంతో రంగధామప్ప అనే కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని టీడీ పల్లి ఎస్సీ కాలనీకి చెందిన రంగధామప్ప మేక పిల్లల మేత కోసం గ్రామ పొలిమేర వద్దకు వెళ్లి గడ్డి కోసే పనిలో నిమగ్నమయ్యాడు. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి రెండు పెద్ద ఎలుగుబంట్లు హఠాత్తుగా వచ్చి దాడి చేశాయి. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. వెంబడించి మరీ దాడి చేశాయి. ఎడమ చేయి, భుజం, కుడికాలు తొడ కింద భాగాన తీవ్రంగా రక్కి గాయపరిచాయి. ఎలాగోలా తప్పించుకుని తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే రొళ్ల సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
అనుమానాస్పద మృతి
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని కామక్కపల్లి అటవీ ప్రాంతంలో రామగిరి మండలం పేరూరు గ్రామానికి చెందిన తిమ్మక్క (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి బలవన్మరణం
గోరంట్ల: మండలంలోని బూచేపల్లికి చెందిన శివశంకర్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. గ్రామ సమీపంలోని తన పొలంలో బుధవారం చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.