
‘అన్నదాత పోరు’తో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి
రొద్దం(పరిగి)/పెనుకొండ రూరల్: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన తలపెట్టిన ‘అన్నదాత పోరు’కు రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు. ఈ మేరకు ఆమె శనివారం పార్టీ శ్రేణులతో కలిసి పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో, రొద్దం మండలం చిన్నమంతూరులో ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కనీసం ఎరువులు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. గతేడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇప్పటికీ నయా పైసా ఆర్థికసాయం అందించలేదన్నారు. ఈ ఏడాది కూడా ప్రకృతి కన్నెర్ర చేసినా ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలూ చేపట్టలేదన్నారు. ఆర్‌ఎస్‌కేల్లో యూరియా స్టాక్ లేదని, డిస్ట్రిబ్యూటర్లే బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఎండగట్టేందుకే ‘అన్నదాత పోరు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెనుకొండలో జరిగిన కార్యక్రమంలో సోమందేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు అశోక్ కుమార్, పార్టీ మండల కన్వీనర్ గజేంద్ర, ఉప సర్పంచ్ వేణు, బ్రాహ్మణపల్లి సర్పంచ్ జిలాన్ ఖాన్, నాయకులు మంజూనాథ్, ఇమామ్ వలి, రఫీక్ సాబ్, జితేంద్ర రెడ్డి, అభిషేక్‌రెడ్డి, ఆదినారాయణ, చిన్నమంతూరులో జరిగిన కార్యక్రమంలో రొద్దం ఎంపీపీ నాగమ్మ, నాయకులు రామచంద్రారెడ్డి, ఎన్.నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, చెరుకూరి సర్పంచ్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
రైతాంగాన్ని ఆదుకోవడంలో
సర్కారు విఫలం
ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీ చరణ్