‘ఉపాధి’ కూలీల వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కూలీల వేతన వెతలు

Sep 7 2025 7:08 AM | Updated on Sep 7 2025 7:08 AM

‘ఉపాధి’ కూలీల వేతన వెతలు

‘ఉపాధి’ కూలీల వేతన వెతలు

సాక్షి, పుట్టపర్తి/ఎన్‌పీకుంట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కూలీలకు వేతనాలు అందడం లేదు. మూడు నెలలుగా జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు సంబంధించి సుమారు రూ.77.47 కోట్ల వేతన బకాయిలు రావాల్సి ఉంది. వేతనాలు సకాలంలో రాకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో సుమారు 3.83 లక్షల మంది కూలీలు ఉండగా.. వీరిలో 80 వేల మంది దాకా పనుల్లో పాల్గొని, మూడు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. చివరగా ఈ ఏడాది మే 28న వేతనం జమ అయ్యింది.

తగ్గిపోయిన హాజరు

సకాలంలో వేతనాలు రాకపోవడంతో ‘ఉపాధి’ పనులకు కూలీల హాజరు పూర్తిగా తగ్గిపోయింది. నాలుగైదు రోజులుగా జరిగిన పనులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. రోజువారీగా జిల్లాలో కనీసం రెండు వేల మంది కూడా పనుల్లో పాల్గొనడం లేదు. ఈ నెల మూడో తేదీన 1,997 మంది మాత్రమే హాజరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అధికారులను అడిగితే నిధులు రాగానే జమ చేస్తామంటున్నారని, ఎప్పుడొస్తాయో చెప్పడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధిలేక చాలామంది కూలీలు బతుకుదెరువు కోసం బెంగళూరు, కేరళ వంటి ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు.

గత ప్రభుత్వంలో ఇబ్బంది లేకుండా..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉపాధి కూలీలకు ఎప్పటికప్పుడు వేతనాలు జమ అయ్యేవి. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాగానే.. కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపాధి పనులను గాలికొదిలేసింది. పైగా క్షేత్ర స్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో పనులపై ఆసక్తి పోయిందని కూలీలు చెబుతున్నారు.

మూడు నెలలుగా జమ కాని కూలి డబ్బు

పనులపై కొరవడిన ఆసక్తి

రెండు వేలకు మించని హాజరు

జిల్లాలో...

జాబ్‌కార్డులు – 2.17 లక్షలు

మొత్తం కూలీలు – 3.83 లక్షలు

పనుల్లో పాల్గొన్న కూలీలు – 80 వేలు

వేతన బకాయిలు – రూ.77.47 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement