
కొనసాగుతున్న యూరియా కష్టాలు
రత్నగిరి ఆర్‌ఎస్‌కే వద్ద రైతుల రద్దీ
బీడుపల్లి ఆర్‌ఎస్‌కే వద్ద యూరియా కోసం వేచివున్న రైతులు
పుట్టపర్తి టౌన్: రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. బస్తా యూరియా దొరకడం కూడా గగనంగా మారింది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి రైతు సేవా కేంద్రంలో శనివారం యూరియా పంపిణీ చేపట్టారు. ఈ కేంద్రానికి 140 బస్తాల యూరియా మాత్రమే కేటాయించారు. గ్రామంలో రైతుల సంఖ్య 500 పైగా ఉంది. దీంతో రైతులు ఉదయం ఆరు గంటల నుంచి పడిగాపులు కాశారు. ఆర్‌ఎస్‌కే సిబ్బంది ఉదయం 10 గంటలకు పంపిణీ ప్రారంభించారు. రైతుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్కరికి బస్తా మాత్రమే అందజేశారు. 135 మంది రైతులు మొదట పేర్లు నమోదు చేసుకోగా..వారికి మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. సర్వర్ నిదానంగా పనిచేయడంతో పంపిణీ మందకొడిగా సాగింది.
రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి రైతు సేవా కేంద్రం వద్ద శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇది వరకే మల్లినమడుగు, దొడ్డేరి రైతు సేవా కేంద్రాలకు 120 బ్యాగుల చొప్పున సరఫరా అయిన యూరియా ప్రస్తుతం ఖాళీ అయింది. దీంతో రత్నగిరిలో పంపిణీ చేస్తారని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. అక్కడ కూడా 120 బ్యాగుల యూరియా మాత్రమే ఉండగా.. వందల సంఖ్యలో రైతులు రావడంతో పంపిణీ చేసేందుకు ఆర్‌ఎస్‌కే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం బస్తా యూరియా ధర రూ.266.50 చొప్పున నిర్ణయించగా.. ఆర్‌ఎస్‌కే సిబ్బంది రూ.300 వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

కొనసాగుతున్న యూరియా కష్టాలు