
కిక్కిరిసిన ఖాద్రీశుని ఆలయం
కదిరి టౌన్: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. కదిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, కర్ణాటక నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఇన్‌స్పైర్ మనాక్‌పై రేపటి నుంచి అవగాహన
ప్రశాంతి నిలయం: జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇన్‌స్పైర్ మనాక్, స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో నామినేషన్ల అప్‌లోడ్‌పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి క్రిష్టప్ప శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పెనుకొండ డివిజన్ ఉపాధ్యాయులకు సోమవారం ఉదయం హిందూపురంలోని చిన్మయా విద్యాలయంలో, పుట్టపర్తి డివిజన్ వారికి సోమవారం మధ్యాహ్నం కొత్తచెరువు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మవరం డివిజన్ ఉపాధ్యాయులకు మంగళవారం ఉదయం ధర్మవరం బాలుర ఉన్నత పాఠశాలలో, మధ్యాహ్నం కదిరి డివిజన్ ఉపాధ్యాయులకు కదిరి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఉన్నత, ప్రాథమికోన్నత, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచి గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం బోధించే ఒక్కొక్క ఉపాధ్యాయుడిని పంపించాలని ఆదేశించారు. రిజిస్టర్ చేసుకున్న అన్ని పాఠశాలల నుంచి సెప్టెంబర్ 15లోగా నామినేషన్లు సమర్పించాలని సూచించారు.
ఘనంగా సత్యసాయి మీడియా సెంటర్ వార్షికోత్సవం
ప్రశాంతి నిలయం: సత్యసాయి మీడియా సెంటర్ 24వ వార్షికోత్సవం శనివారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి చెంత ఘనంగా జరిగింది. ఉదయం వేడుకలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి కిడ్ వరల్డ్ చానెల్‌కు చెందిన చిన్నారులు ‘గణేష్ మహిమ’ పేరుతో అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చారు. సత్యసాయి మీడియా సెంటర్ సాధించిన ఘట్టాలతో కూడిన పుస్తకాన్ని ఆర్‌జే రత్నాకర్‌తో పాటు ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి, మీడియా సెంటర్ డైరెక్టర్ సుందర్ స్వామినాథన్ ఆవిష్కరించారు. సాయంత్రం మీడియా సెంటర్ సభ్యులు ప్రశాంతి వాహిని పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు.

కిక్కిరిసిన ఖాద్రీశుని ఆలయం