
బ్యాంకు దోపిడీ కేసులో నిందితుడి అరెస్టు
పుట్టపర్తి టౌన్: హిందూపురం రూరల్ తూముకుంట చెక్‌పోస్ట్ సమీపంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచులో దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడు అనిల్ కుమార్ పన్వార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు కిలోల బంగారు ఆభరణాలు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ రత్న శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్‌తో కలసి మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జులై 26న తూముకుంట ఎస్‌బీఐలో దొంగతనం జరిగింది. విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురైనట్లు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హిందూపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషీ ఆదేశాల మేరకు అనంతపురం, చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పోలీసులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఐదు రాష్ట్రాలలో గాలింపు చేపట్టారు. ఈ కేసులో నిందితుడైన హర్యానా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ పన్వార్‌ను గుర్గాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు కేజీల బంగారు ఆభరణాలు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన పన్వార్.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఉద్దేశంతో దేశంలో అనేక చోట్ల బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్లో జైలుకు వెళ్లడం, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. గతంలో అనంతపురంలో జరిగిన బ్యాంకు దోపిడీ కేసులోనూ ముద్దాయిగా ఉన్నాడు. ఇతనిపై వివిధ రాష్ట్రాల్లో 18 కేసులు ఉన్నాయి. ఐదేళ్లు జైలుకు కూడా వెళ్లాడు. కాగా..తూముకుంట బ్యాంకు దోపిడీ కేసులో రాజస్థాన్‌కు చెందిన ఇంకొక ముఠా సభ్యుడు పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యుణ్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు.
రెండు కిలోల బంగారు ఆభరణాలు, కారు, బైకు స్వాధీనం