
ఆయతపల్లిలో విషాదం
రాయదుర్గం టౌన్: మండలంలోని ఆయతపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గణపతి నిమజ్జనం కోసం నీటి కుంటలో దిగిన ఓ బాలుడు బురదలో కూరుకుపోయి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం కొత్తపల్లికి చెందిన మల్లయ్య, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మనోజ్ (9) చిన్నప్పటి నుంచి రాయదుర్గం మండలం ఆయతపల్లిలోని అవ్వతాతల వద్ద ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. ప్రస్తుతం నాల్గో తరగతి చదువుతున్న మనోజ్ శుక్రవారం మరో ఇద్దరు స్నేహితులతో కలసి మట్టితో ఓ చిన్నగణపతిని చేశాడు. అనంతరం వారికి తోచిన విధంగా పూజలు చేసి సరదాగా ఆడుకుంటూ పాఠశాల వెనుక ఉన్న కుంటలో నిమజ్జనం చేసేందుకు వెళ్లారు. గణపతి బొమ్మను తీసుకుని కుంటలోకి దిగిన మనోజ్ బురదలో కూరుకు పోతుండగా.. గమనించిన తోటి స్నేహితులు పరుగున గ్రామంలోకి వెళ్లి బంధువులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని బాలుడిని వెలికి తీసి రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.
నీటి కుంటలో దిగి 4వ తరగతి విద్యార్థి మృతి
సరదాగా స్నేహితులతో కలిసి ఓ చిన్న గణపతిని
నిమజ్జనం చేస్తుండగా ఘటన