కన్నీళ్లే మిగిలాయి.. | - | Sakshi
Sakshi News home page

కన్నీళ్లే మిగిలాయి..

Sep 8 2025 5:04 AM | Updated on Sep 8 2025 5:04 AM

కన్నీళ్లే మిగిలాయి..

కన్నీళ్లే మిగిలాయి..

కరుణ లేని సర్కారులో

తన ఈడు స్నేహితురాళ్లతో సంతోషంగా ఆడుకోవాల్సిన వయసులో తీరని అన్యాయానికి గురైంది. మృగాళ్ల చేతికి చిక్కి విలవిలలాడిపోయింది. తల్లిదండ్రుల ప్రేమానురాగాలు పొందాల్సిన సమయంలో తనే ఓ బిడ్డకు తల్లయ్యింది. మేమున్నాం అంటూ ఆదుకోవాల్సిన వారు.. అలా చేస్తే ఎక్కడ తప్పు ఒప్పుకున్నట్లు అవుతుందోనని అసలు అటువైపే చూడలేదు. నాలుగు గోడలకే పరిమితం చేసేశారు. గుండెలవిసేలా రోదించినా స్పందన లేదు. అయిన వాళ్లు లేరు.. పలకరించే వారు కరువయ్యారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా కరువైపోయాయి. మౌన రోదనే మిగిలింది. చంద్రబాబు ప్రభుత్వ అలసత్వ ధోరణితో ఏడుగుర్రాలపల్లి దళిత బాలిక కుటుంబం వీధిన పడింది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: గత టీడీపీ సర్కారు హయాంలో కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతిని కొందరు మృగాళ్లు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ పాపం ఇప్పటికీ చంద్రబాబు సర్కారును వెంటాడుతోంది. ఇంచుమించు అలాంటి ఘటనే మళ్లీ.. అదీ బాబు సీఎంగా ఉన్న సమయంలోనే రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లెలో జరిగింది. టీడీపీకి చెందిన మానవ మృగాలు ఓ దళిత బాలికను చెరపట్టి సామూహిక అత్యాచారం చేశాయి. దీంతో ఆ బాలిక గర్భం దాల్చి బిడ్డకు తల్లయింది. ఈ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృగాళ్ల చేతిలో అన్యాయానికి గురైన బాలిక నేడు ఓ ఎన్జీవో హోంలో బాధను దిగమింగు కుని బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తోంది.

కొన్ని మాసాల క్రితం ఏడుగుర్రాలపల్లెలో దళిత మైనర్‌ బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసే సరికి ఆమె ఐదు మాసాల గర్భిణి. తర్వాత రెండు నెలలకు అనంతపురం సర్వజనాసుపత్రిలో ప్రసవం అయింది. అనంతరం మూడు వారాలకే తల్లినుంచి బిడ్డను వేరు చేశారు. తల్లిని బత్తలపల్లిలోని ఆర్డీటీ హోంలో ఉంచారు. పసి కందును ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. స్కూలుకెళ్లి ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన ఆ బాలిక ఇప్పుడు ఎన్జీవో హోంలో ఒంటరిగా జీవిస్తోంది. ఎక్కడికెళ్లాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. ఇక్కడ ఎన్నిరోజులు ఉంచుతారో తెలియదు. ఎప్పుడు బయటకు పంపిస్తారో తెలియదు.. ఇదీ ఆ బాలిక ఎదుర్కొంటున్న అగమ్యగోచర పరిస్థితి.

అప్పుడూ అంతే.. ఇప్పుడూ అంతే..

గతంలో సుగాలి ప్రీతి.. నేడు ఏడుగుర్రాలపల్లిలో యువతి

దళిత మైనర్‌ బాలిక జీవితం అథోగతి

ప్రసవమైన మూడు వారాలకే తల్లీబిడ్డను వేరుచేసిన అధికారులు

ఎన్జీవో హోంలో బిక్కు బిక్కుమంటూ బతుకీడుస్తున్న బాలిక

పసికందును ఎక్కడికి చేర్చారో

ఇప్పటికీ తెలియని దుస్థితి

బాధిత కుటుంబాన్ని పట్టించుకోని బాబు ప్రభుత్వం

ఎన్జీవో హోంలో ఒంటరి బతుకు..

సామూహిక అత్యాచారంతో సర్వస్వం కోల్పోయిన దళిత మైనర్‌బాలికకు సర్కారు పైసా సాయం అందించలేదు. సాయం ప్రకటిస్తే నేరం ఒప్పుకున్నట్టు అవుతుందేమో అనుకున్న ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. కనీసం రాప్తాడు ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదు. ఆ బాలికకు సర్కారు సాయం లేక, కుటుంబంలో కూడా చూసుకునే వారు కరువై జీవితమే ఛిద్రమైంది. ఇప్పుడా బాలికను పోషిస్తారో లేదో కూడా అంతుచిక్కడం లేదు. స్వగ్రామానికి వెళ్లినా బతకనిస్తారా అన్నది అనుమానంగా ఉందని జిల్లా వాసుల్లో చర్చ జరుగుతోంది. కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి తరహాలోనే ఈ బాధితురాలికి టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజుకు కూడా బాలికను పరామర్శించడానికి గాని, బిడ్డను చూడటానికి గాని ఎవరికీ ప్రవేశం లేకుండా అధికారులు నిషేధం విధించారు. నెలరోజులుగా తల్లీ బిడ్డ ఎలా ఉన్నారు.. వారి బాగోగులు ఏమిటి అన్న వివరాలు ఎవరికీ తెలియడం లేదు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు గొంతెత్తితే అడ్డుకోవడం లేదా అరెస్టులు చేస్తున్నారు. గతంలో సుగాలి ప్రీతి హత్యాచారం కేసులో చేసిన పాపాన్ని నేడు ఏడుగుర్రాలపల్లిలో అత్యాచారం ఘటన విషయంలోనూ కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement