
రిజర్వు స్థలంలో మట్టి తవ్వకాలు
ధర్మవరం: టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. మున్సిపల్ రిజర్వు స్థలంలో అక్రమంగా మట్టి తవ్వి తరలించేస్తున్నారు. పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్ కాలనీలో పాఠశాల పక్కన ఉన్న మున్సిపల్ రిజర్వు స్థలంలో జేసీబీలతో ఇష్టారాజ్యంగా తవ్వడంతో పెద్దపెద్ద గుంతలు కనిపిస్తున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్టు చోద్యం చూస్తున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు చేరితే ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదని కాలనీవాసులు అంటున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి అక్రమంగా మట్టిని తరలించకుండా రిజర్వు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు.
రిజర్వు స్థలంలో తవ్వకాలతో ఏర్పడిన పెద్ద గుంతలు