
అన్నదాత పోరుకు తరలిరండి
● యూరియాపై సీఎం మాటలు హాస్యాస్పదం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్
గోరంట్ల: ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను నిరసిస్తూ రైతులకు బాసటగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన అన్నదాత పోరును విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పిలుపునిచ్చారు. పెనుకొండలో ఈ నెల 9న నిర్వహించే ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆమె ఆదివారం గోరంట్లలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ యూరియా సహా అవసరమైన ఎరువుల సరఫరాలో ప్రభుత్వం విఫలం కావడంతో వరి, ఇతర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా వినియోగం వల్ల క్యాన్సర్ వస్తుందంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన సొంత కంపెనీ హెరిటేజ్‌కు లాభాలు చేకూర్చడం కోసం రైతులు వరి, ఇతర పంటలు సాగు చేయకుండా పాడిపరిశ్రమ వైపు దృష్టి సారించాలని చెబుతున్నారని ధ్వజమెత్తారు. బ్లాక్‌మార్కెట్‌ను నియంత్రించి, ఎరువులను పక్కదారి పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల సిఫార్సుల మేరకు కాకుండా సీనియారిటీ ప్రాతిపదికన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు.
బాబు మోసాలను వివరించండి
ఎన్నికల సమయంలో ఇచ్చిన వందలాది హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని ఉషశ్రీచరణ్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం కమ్మవారిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఏడాది దాటినా అరకొర పథకాలు అమలు చేసి.. అవీ అనేక కొర్రీలు వేసి చాలామంది అర్హులకు ఫలాలు అందకుండా చేశారని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వెంకటేశు, టౌన్ కన్వీనర్ మేదర శంకర, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఆర్.వెంకటరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఫక్రుద్ధీన్ సాబ్, సీనియర్ నాయకులు గంపల వెంకటరమణారెడ్డి, కమ్మవారిపల్లి పంచాయతీ నాయకులు రంగారెడ్డి, రాజు, రామిరెడ్డితో పాటు మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.