
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
బత్తలపల్లి/ ముదిగుబ్బ: బత్తలపల్లి మండల పరిధిలోని ముదిగుబ్బ – చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ల మధ్యన జిల్లేడుబండ నది ఆర్‌ఓబీపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. సమాచారం అందుకున్న ధర్మవరం రైల్వే పోలీసులు శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. శరీరం ఛిద్రమైంది. 5.5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగు, మెరూన్ రంగు టీ షర్టు, నీలం... ఎరుపు రంగు గళ్ల లుంగీ ధరించాడు. ఇంతకు మించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 89786 56463, 99513 25345కు సమాచారం అందించాలని కోరారు.
తాగుడుకు డబ్బివ్వలేదని..
రాప్తాడు: తాగుడుకు డబ్బు ఇవ్వలేదంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం యర్రగుంటకు చెందిన ఉప్పర గౌతమికి రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి కోడిగ సంజీవయ్య (31)తో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. యర్రగుంటలోనే కాపురం ఉంటున్నారు. అదే గ్రామంలో ఐసీఆర్పీ సంస్థలో గౌతమి ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మద్యానికి బానిసైన సంజీవయ్య ఎలాంటి పనిపాటా చేయకుండా జులాయిగా మారాడు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకుని మద్యం మత్తులో తరచూ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. తాగేందుకు డబ్బు ఇవ్వాలని కొట్టేవాడు. పలుమార్లు పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి నచ్చచెప్పినా అతనిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 4న తాగేందుకు డబ్బు ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో గడ్డి మందు తాగి బాత్రూమ్‌లో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక గురువారం రాత్రి సంజీవయ్య మృతి చెందాడు. గౌతమి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణలో..
నల్లమాడ వాసి మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
నల్లమాడ: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కడతాల్ బస్టాప్ వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ప్రమాదంలో నల్లమాడ మండల వాసి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు తెలిపిన మేరకు... నల్లమాడ మండలం కొండ్రవారిపల్లికి చెందిన జె.రంగస్వామి నాయుడు (57) కొంతకాలంగా తెలంగాణ ప్రాంతంలో మామిడి, జామ తోటల ఫలసాయం కొనుగోలు చేస్తూ పండ్ల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారం రోజుల క్రితం స్వగ్రామంలో కుమారుడు హరినాయుడు వివాహం జరిపించాడు. పెళ్లి తంతు ముగించుకుని గురువారం రాత్రి రైలులో తన భార్య ఆదిలక్ష్మి, సహాయకుడు నరసపు కిష్టప్పతో కలసి హైదరాబాద్‌కు బయల్దేరిన రంగస్వామి నాయుడు శుక్రవారం తెల్లవారుజామున కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. అనంతరం తాము నివాసముంటున్న ప్రాంతానికి వెళ్లేందుకు రంగారెడ్డి జిల్లా కడతాల్ బస్టాప్‌కు చేరుకుని బస్ కోసం వేచి ఉండగా... హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వచ్చిన దూసుకొచ్చిన కారు ముగ్గురినీ ఢీకొంది. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆదిలక్ష్మి, కిష్టప్పను ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ గుర్తించి ఆస్పత్రికి తరలించాడు. రోడ్డుకు దూరంగా ఎగిరి పడిన రంగస్వామినాయుడుని గుర్తించలేకపోయాడు. విషయం తెలుసుకున్న అక్కడికి సమీపంలో నివాసం ఉంటున్న నల్లమాడ మండల వాసులు వెంటనే ప్రమాదస్థలానికి చేరుకుని రోడ్డుకు కొంత దూరంలో పడి ఉన్న రంగస్వామినాయుడును గుర్తించి సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక మృతి చెందాడు. కిష్టప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆదిలక్ష్మికి రెండు కాళ్లు దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలిపారు. శనివారం రంగస్వామి నాయుడు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య