
జన్‌ధన్ ఖాతాలకు కేవైసీ చేయించుకోండి
లేపాక్షి: కేంద్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం ప్రారంభించిన జన్‌ధన్ పథకానికి సంబంధించి బ్యాంక్ ఖాతాలు తెరిచిన వారు మరో సారి కేవైసీ చేయించుకోవాలని, లేకపోతే ఆ ఖాతాలు రద్దు అయ్యే అవకాశముందని ఆర్‌బీఐ ఎఫ్‌ఐ విభాగం జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్ మహనా పేర్కొన్నారు. లేపాక్షి మండలం చోళసముద్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణా బ్యాంక్ ఆధ్వర్యంలో, లేపాక్షిలోని అన్నదాన సత్రంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా జనసురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఇందులో భాగంగానే ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలు అమలులోకి వచ్చాయన్నారు. ఆయా పథకాలపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎల్‌డీఓ రోహిత్ అగర్వాల్, ఎల్‌డీఎం రమణకుమార్, జోనల్ హెడ్ శ్రీనివాసకుమార్, రీజనల్ ఎల్‌డీఎంలు రమణ కుమార్, జితేంద్ర కుమార్ మిశ్రా, రమేష్, బ్రాంచ్ మేనేజర్లు విజయబాబు, జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఆర్‌బీఐ ఎఫ్‌ఐ విభాగం జనరల్ మేనేజర్ రాజేష్‌కుమార్ మహనా