
మాజీ మావోయిస్టుల సమస్యలు పరిష్కరించండి
పుట్టపర్తి అర్బన్: స్థానిక మాజీ మావోయిస్టుల కాలనీలో ఇంటి స్థలాలను ఇతరులకు కేటాయించకుండా చూడాలని ఆర్డీఓ సువర్ణకు ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారాం విన్నవించారు. సమస్య పరిష్కారం కోరుతూ బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం వినతి పత్రం అందజేసి సొసైటీ అధ్యక్షుడు రాజారాం, బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లాయర్ హరి మాట్లాడారు. పుట్టపర్తి సమీపంలోని కప్పలబండ రెవెన్యూ పరిధిలో ధరణి సొసైటీ సభ్యులకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు 4.5 ఎకరాలను కేటాయించారని గుర్తు చేశారు. ఇందులో సొసైటీలో సభ్యులు కాని వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, నిర్మాణాలు చేపట్టేలా అదే గ్రామానికి చెందిన లోచర్ల విజయభాస్కరరెడ్డి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ అంశంలో స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని అధికారులకు సిఫారసు చేశారని, ఇది నిజమని తేలితే ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు హనుమన్న, బొంతలపల్లి శ్రీరాములు, బాలు, తదితరులు పాల్గొన్నారు.