
అప్పుల ఊబిలో రాష్ట్రం
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం
అనంతపురం అర్బన్: సీఎం చంద్రబాబు ఏడాది పాలనలో రాష్ట్రం రూ.1.50 లక్షల కోట్ల అప్పల ఊబిలో కూరుకుపోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అనంతపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్‌తో కలసిఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రమూ చేయనన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తోందన్నారు. అమరావతి పేరుతో రూ.31 వేలు కోట్లు అప్పు తెచ్చారన్నారు. మరో రూ.31 వేల కోట్ల అప్పు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. చంద్రబాబు ఢిల్లీ, సింగపూర్ పర్యటనల వల్ల రాష్ట్రానికి మేలు జరగకపోగా.. అప్పుల భారం మరింత పెరుగుతోందన్నారు. 21సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. పోలవరం ఎత్తు తగ్గించినా నోరుమెదపలేకపోయారని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సహకరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ట్రూఅప్ చార్జీల పేరుతో ఆరు నెలల్లోనే రూ.15,480 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. సమావేశంలో సీపీఐ ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు జాఫర్, వేమయ్యయాదవ్, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, కార్యదర్శివర్గ సభ్యుడు రాజారెడ్డి, నగర కార్యదర్శి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
కుమార్తెలతో కలసి తండ్రి ఆత్మహత్యాయత్నం
బెళుగుప్ప: కుటుంబ కలహాల నేపథ్యంలో విసుగు చెందిన వ్యక్తి.. తన ఇద్దరు కుమార్తెలతో కలసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు.. బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన రమేష్‌రెడ్డి, దివ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న పాటి విషయానికి ఆదివారం దంపతులు గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన రమేష్‌రెడ్డి.. తన ఇద్దరు కుమార్తెలను వెంట బెట్టుకుని వ్యవసాయ తోటలోకి వెళ్లి విషపు గుళికలు తాను తిని, చిన్నారులకూ తినిపించాడు. కాసేపటి తర్వాత పిల్లలను పిలుచుకుని ఇంటికి చేరుకున్నాడు. విషయాన్ని తల్లికి చిన్నారులు తెలపడంతో కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కాగా, ఆరేళ్ల వయసున్న కుముద్విని, మూడేళ్ల వయసున్న ఛైత్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఎంపీఆర్‌లోకి
తుంగభద్ర జలాలు
గార్లదిన్నె: మండలంలోని పెనకచెర్ల వద్ద ఉన్న మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్)లోకి తుంగభద్ర జలాలు చేరుతున్నాయి. దీంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం రిజర్వాయర్ ఏఈ సురేంద్ర మాట్లాడుతూ.. కణేకల్లు నుంచి మోపిడి కాలువ ద్వారా రోజూ 500 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి చేరుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లుగా తెలిపారు.

అప్పుల ఊబిలో రాష్ట్రం