
వడ్డీ వ్యాపారులను కఠినంగా శిక్షించాలి
ధర్మవరం అర్బన్: ‘‘పట్టపగలు ఏడుగురు వ్యక్తులు ఇంట్లో దూరి రమణ, భారతి దంపతులతో పాటు వారి పిల్లలపై దాడి చేయడం దుర్మార్గం. వడ్డీ వ్యాపారులు ఇలా పేట్రేగిపోతున్నా ఇక్కడి పోలీసులు ఏం చేస్తున్నారు.. ఇంటిలిజెన్స్ ఏం చేస్తోంది..? ఇక్కడున్న మంత్రికి ఈ విషయాలు తెలియవా.? వెంటనే పోలీసులు వడ్డీ వ్యాపారులను అరెస్టు చేయాలి. వారి వెనుక ఎవరున్నారో వారినీ శిక్షించాలి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల దాడిలో గాయపడిన రమణ కుటుంబాన్ని సోమవారం ఆయన పరామర్శించి, మాట్లాడారు. ధర్మవరంలో పవర్‌లూమ్స్ పెరగడంతో చేనేతపై ఆధారపడిన వారు అప్పుల్లో కూరుకుపోయారన్నారు. ఈ క్రమంలో రాజా అనే వ్యక్తి వద్ద రమణ గత ఏడాది రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడని, అనంతరం ఇబ్బందుల్లో ఉన్న తన మిత్రుడికి రూ.4 లక్షలు అప్పుగా ఇప్పించాడన్నారు. మొత్తం రూ.6 లక్షల అప్పునకు గాను ఇప్పటి వరకూ రూ.15.30 లక్షలు వడ్డీ కట్టినా... దాడికి పాల్పడడం దారుణమన్నారు. బాధితుడిని ఇప్పటి వరకూ కూటమి నేతలు పరామర్శించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పోలీసులు కూడా నిందితులు పరారీలో ఉన్నారని చెబుతున్నారని, వాళ్లేమైనా దేశం వదిలి వెళ్లారా అని ప్రశ్నించారు. వడ్డీ వ్యాపారులు ధర్మవరం పట్టణంలో అనేక మందిని హింసించారని, వెంటనే అధిక వడ్డీవ్యాపారులందరినీ చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అధిక వడ్డీలు కట్టలేని కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీనియర్ నాయకులు ఎస్‌హెచ్ బాషా, పట్టణ కార్యదర్శి మారుతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నామాల నాగార్జున, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, అయూబ్‌ఖాన్; ఎల్.ఆదినారాయణ, ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకుడు గుంపు హరి తదితరులు పాల్గొన్నారు.
కేసులతో సరిపెడితే ఊరుకోం..
అరెస్టు చేయాలి
పరారీలో ఉన్నారని
పోలీసులు చెప్పడం హాస్యాస్పదం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్