
పిచ్చికుక్క స్వైర విహారం
● నలుగురికి తీవ్ర గాయాలు
రొళ్ల: ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారినల్లా కరిచింది. ఈ ఘటన మండల పరిధిలోని దొడ్డేరి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఓబుళమ్మ, తిప్పన్న, సన్నరంగప్పతో పాటు హనుమంతరాయప్ప సోమవారం ఉదయం బహిర్భూమి కోసం బయటికి వెళ్లారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ పిచ్చికుక్క నలుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అదేవిధంగా ఏడు ఆవులు, ఒక గేదైపె కూడా దాడి చేసి వాటినీ గాయపరిచింది. స్పందించిన స్థానికులు బాధితులను 108 వాహనంలో రొళ్ల సీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం గ్రామస్తులు పిచ్చికుక్కను వెంబడించి పట్టుకుని చంపేశారు. కుక్కకాటుకు గురైన వారు తప్పని సరిగా రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు తెలిపారు.
‘పరిష్కార వేదిక’కు
234 అర్జీలు
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు మొత్తంగా 234 అర్జీలు అందాయి. ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు ఇవ్వగా.. కలెక్టర్ చేతన్ వాటిని స్వీకరించి ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు ఎంతో నమ్మకంతో కలెక్టరేట్ వరకూ వచ్చి అర్జీలు ఇస్తారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా అధికారులు గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు.
వసతి గృహాలపై దృష్టి సారించండి..
వసతి గృహాల్లోని ఓవర్ హెడ్‌ట్యాంక్‌లు, మరుగుదొడ్లు, కిచెన్‌లు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. వసతి గృహాల్లో శుభ్రత లేకపోయినా, కలుషిత నీరు సరఫరా అయినా సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ సమత పాల్గొన్నారు.
వీఆర్‌కు కదిరి టౌన్ సీఐ!
అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డిని వీఆర్‌కు పంపారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కదిరి టీడీపీలో రెండు గ్రూపులు ఉండగా.. ఓ వర్గానికి సీఐ నారాయణరెడ్డి మద్దతుగా నిలుస్తూ.. మరో వర్గం వారిపై కేసులు బనాయిస్తూ వచ్చారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి బాధిత నాయకులు తీసుకెళ్లారు. దీంతో సీఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందడంతో పోలీసు ఉన్నతాధికారులు నారాయణరెడ్డిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

పిచ్చికుక్క స్వైర విహారం