
ఇష్టానుసారం వడ్డీ వసూలు చేస్తే చర్యలు
పుట్టపర్తి టౌన్: సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇష్టానుసారం అధిక వడ్డీలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పలుచోట్ల కొందరు వడ్డీ వ్యాపారుల అవతారమెత్తి ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అందులో భాగంగానే ధర్మవరానికి చెందిన భారతి, రమణ దంపతుల ఇంట్లో చొరబడి దాడి చేసిన వడ్డీ వ్యాపారులపై ధర్మవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. అలాగే వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం డీఎస్పీ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వడ్డీ వ్యాపారుల నుంచి ఎవరికై నా ఇబ్బందులు తలెత్తితే బాధితులు ముందుకు రావాలని సూచించారు.
వర్సిటీ ప్రతిష్టను కాపాడాలి
● ఎస్కేయూ ఇన్‌చార్జ్ వీసీ అనిత
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టనును కాపాడేలా విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత అన్నారు. ఎస్కేయూ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ. పీఎం ఉష పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు. ఫిజిక్స్ విభాగంలో ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రాముఖ్యతను వివరించారు. ఇంక్యుబేషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. విశిష్ట అతిథిగా హాజరైన విక్రమ సింహపురి వర్సిటీ మాజీ వీసీ, ఎస్కేయూ మాజీ రెక్టార్ సీ.ఆర్. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కీడల్లో సత్తా చాటిన వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఇష్టానుసారం వడ్డీ వసూలు చేస్తే చర్యలు