
ఈసారీ కరువే
ఖరీఫ్ సీజన్ దాటిపోతున్నా సరైన వర్షం పడలేదు. పోయిన సారి కూడా ఇదే పరిస్థితి. గత ఏడాది లాగానే ఈసారి కూడా కరువు ఛాయలే కనబడుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువే. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే కష్టమే. అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా ఇంత వరకూ ఇవ్వలేదు. – ఓబిరెడ్డి,
బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం
వారం రోజులే గడువు
ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. ఆగస్టు మొదటి వారం తర్వాత ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడమే మంచిది. పెసలు, ఉలవ, అలసంద, జొన్న ఇలాంటి పంటలు ఉత్తమం. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాం. త్వరలోనే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చు.
–వై.వి.సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి
కదిరి: వరుణ దేవుడు ఈసారి కూడా ముఖం చాటేశాడు. నాలుగైదు రోజులుగా తుంపరతో సరిపెడుతున్నాడు. సీజన్ ప్రారంభమయ్యాక పదునైన వర్షం కురవకపోవడంతో నేటికీ విత్తనం పడటం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పంట వేరుశనగ సాగుకు ఆగస్టు మొదటి వారంతో అదును దాటిపోతుందని, ఆ తర్వాత వేరుశనగ సాగు చేయవద్దని శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అందుకే రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
జిల్లాలో ఖరీఫ్‌లో సాగు పరిస్థితి ఇలా..
వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌లో ఈసారి కూడా వేరుశనగ సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 1,51,824 హెక్టార్లు కాగా, ఇప్పటి దాకా జిల్లా రైతులు కేవలం 27,976 హెక్టార్లలోనే (18.43శాతం) పంట సాగు చేశారు. ఇక 28,925 హెక్టార్లలో సాగులోకి రావాల్సి ఉండగా... ఇప్పటి దాకా 9,369 హెక్టార్లకే (32.39 శాతం) పరిమితమైంది. కంది కూడా ఆగస్టు 15 తర్వాత సాగుచేయకపోవడమే మేలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక కొర్ర సుమారు 650 హెక్టార్లలో సాగులోకి రావాల్సి ఉండగా, కేవలం 11 హెక్టార్లు మాత్రమే సాగైంది. ఇతర పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ప్రత్యామ్నాయ పంటలే మేలు..
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ సాగుకు ఇక వారం రోజులే గడువు ఉందని, ఆ తర్వాత ప్రత్యామ్నాయ పంటలే మేలని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. పెసలు, ఉలవ, అలసంద, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చంటున్నారు. వీటి సాగుకు ఖర్చు, పంట కాలపరిమితి తక్కువేనని వారు సూచిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ పంటల సాగుకు కూడా కనీసం ఒక పదును (25 మి.మీ) వర్షం పడాలంటున్నారు.
ప్రభుత్వానికి ముందు చూపేదీ?
గతంలో ఒకసారి వేరుశనగ సాగుకు సమయం దాటిపోతే అప్పటి జగన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించింది. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 25 వేల క్వింటాళ్ల పెసలు, ఉలవ, అలసంద, జొన్న వంటి ధాన్యాలను ఆర్‌బీకేల్లో సిద్ధం చేసింది. 80 శాతం సబ్సిడీతో రైతులకు అందించింది. కానీ చంద్రబాబు నేతృత్వంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వేరుశనగ సాగుకు సమయం దాటిపోతున్నా... ఇప్పటి దాకా ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు.
ఆకాశం వైపు ఆశగా
చూస్తున్న రైతులు
వేరుశనగ విత్తుకు అదును
దాటిపోతోందంటున్న శాస్త్రవేత్తలు
ఖరీఫ్‌లో వరుసగా
రెండోసారి వర్షాభావ పరిస్థితి