
కృష్ణా జలాలతో చెరువులన్నీ నింపాలి
మడకశిర: మడకశిర బ్రాంచ్ కెనాల్ (ఎంబీసీ) పరిధిలోని 265 చెరువులను కృష్ణా జలాలతో నింపాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జలసాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో మడకశిర జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి సోమ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా జలసాధన సమితి అధ్యక్షుడు, న్యాయవాది రామ్‌కుమార్ మాట్లాడుతూ.... ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు కృష్ణా జలాలు అందించాలని డిమాండ్ చేశారు. పిల్ల కాలువల ద్వారా రైతులకు నీరందించి ఆదుకోవాలని కోరారు. అంతేకాకుండా మడకశిర బ్రాంచ్ కెనాల్ సామర్థ్యాన్ని 1,500 క్యూసెక్కులకు పెంచాలని కోరారు. తొలి ప్రాధాన్యతగా గొల్లపల్లి రిజర్వాయర్‌కు ఆ తర్వాత మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా జలాలు వదలాలన్నారు. చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో హంద్రీ–నీవా కాలువ పనులు చేపట్టాలని కోరారు. రత్నగిరి, రాళ్లపల్లి, పందిపర్తి వద్ద హంద్రీనీవా రిజర్వాయర్లను నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు అమరాపురం, అగళి మైనర్ కాల్వల పనులను పూర్తి చేసి కృష్ణా జలాలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం మడకశిరకు చెందిన జలసాధన సమితి నాయకులు ఆనందరంగారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సోమ్‌కుమార్ మాట్లాడుతూ... మడకశిర ప్రాంతంలోని రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు అందించాలని కోరారు. మడకశిర బైపాస్ కెనాల్ పూర్తి చేసి అన్ని చెరువులకు నీరు అందించి కరువు ప్రాంత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సిద్దారెడ్డి, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఉమేష్‌నాయక్, హిందూపురం జలసాధన సమితి అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్మిక సంఘం అధ్యక్షుడు రవి, స్థానిక జలసాధన సమితి నాయకులు పాల్గొన్నారు.
ఎంబీసీ సామర్థ్యాన్ని
1,500 క్యూసెక్కులకు పెంచాలి
మొదటి ప్రాధాన్యతగా గొల్లపల్లి
రిజర్వాయర్‌కు నీరు వదలాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో
జలసాధన సమితి నాయకుల డిమాండ్