
● వాన కురవక.. ఆశ చావక
పెద్దవడుగూరు: మండలంలోని పెద్దవడుగూరు, లక్ష్ముంపల్లి, దిమ్మగుడి, చిన్నవడుగూరు గ్రామాల్లో చాలామంది రైతులు పత్తి, కొర్ర తదితర పంటలు సాగు చేశారు. అయితే, సరిగ్గా మొక్కలు మొలకెత్తాక వానలు కరువయ్యాయి. ఇటీవల మేఘాలు ఊరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. దీంతో పంట ఎండుముఖం పట్టింది. వేల రూపాయలు ఖర్చు చేసి పెట్టిన పంట ఎండిపోతుండడాన్ని రైతులు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు ఎలాగైనా పంటను బతికించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్ముంపల్లి గ్రామానికి చెందిన రైతు ఓబుళరెడ్డి తన పొలంలోని పత్తి మొక్కలకు ద్విచక్ర వాహనంలో బిందెలతో తీసుకెళ్లిన నీటిని పోస్తూ, వాటిని బతికించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.
బాలిక అదృశ్యం
పుట్టపర్తి అర్బన్: మండలంలోని జగరాజుపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక రెండు రోజులుగా కనిపించడం లేదని పుట్టపర్తి రూరల్ పీఎస్ ఎస్‌ఐ లింగన్న ఆదివారం తెలిపారు. జగరాజుపల్లి గ్రామానికి చెందిన హెచ్.రవి కుమార్తె సారిక ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం నుంచి బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఆదివారం మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.●
మహిళ దుర్మరణం
గుమ్మఘట్ట: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడిన ఘటనలో గుమ్మఘట్ట మండల కో–ఆప్షన్ సభ్యుడు హిదతుల్లా తల్లి మసీదా బేగం (55) దుర్మరణం పాలయ్యారు. స్థానికులు తెలిపిన మేరకు.. ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆదివారం తన మనవడితో కలసి ద్విచక్రవాహనంపై కణేకల్లులో ఉన్న కుమార్తెను చూసి వచ్చేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో రాయదుర్గం మండలం కదరంపల్లి వద్దకు చేరుకోగానే మసీదాబేగం చీర కొంగు వాహనం చక్కానికి చుట్టుకోవడంతో అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆ గ్రామానికి చేరుకుని మసీదా బేగం మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెం మున్సిపల్ మాజీ చైర్మన్ గౌని ఉపేంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గౌని లక్ష్మీకాంత రెడ్డి, కాంట్రాక్టర్ ఆర్టీ లక్ష్మీకాంతారెడ్డి, హేమారెడ్డి, స్వామి, చమ్మా ఇబ్రహీం తదితరులు ఉన్నారు.

● వాన కురవక.. ఆశ చావక