పుట్టపర్తి అర్బన్: పంటలపై అడవి పందులు దాడి చేయడంతో వందల ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. అడవి పందుల దాడి నుంచి తమ పంట పొలాలను కాపాడుకోవడానికి రైతులు రాత్రి సమయాల్లో కాపు కాస్తున్నారు. అయినా అర్ధరాత్రి గుంపులు గుంపులుగా వచ్చి పంటను ధ్వంసం చేసి పోతున్నాయి. జిల్లాలో ఏటా వేల ఎకరాల్లో పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయి. పంట పొలాల వద్ద కాపు కాసిన రైతులపై సైతం దాడి చేసి గాయపరుస్తున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అడవి పందులు, నెమళ్లు, జింకల బెడదతో పగలంతా వ్యవసాయంతో అలసిపోయిన రైతులకు రాత్రి పూట కంటి మీద కునుకు కూడా లేకుండా పోతోంది.
2.20 లక్షల హెక్టార్లలో పంటల సాగు..
జిల్లాలోని 32 మండలాల్లో దాదాపు 2.20 లక్షల హెక్టార్లలో పంటల సాధారణ సాగు కాగా, ప్రస్తుత ఖరీఫ్‌లో 32,333 హెక్టార్లలో వివిధ రకాల పంటలను రైతులు సాగుచేస్తున్నారు. మొక్కజొన్న, వేరుశనగ, కంది, పెసర, అలసంద తదితర పంటలను రైతులు ఎంతో ఖర్చు చేసి సాగు చేస్తున్నారు. బోరు బావుల కింద నీటి వసతి కలిగిన రైతులు రెండు నెలల క్రితమే వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. వీటికి ప్రస్తుతం పందులు, నెమళ్ల బెడద అధికంగా ఉంది. చాలా వరకు గ్రామాల్లో అడవి, గుట్ట ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది. అర్థరాత్రి వేళ గుంపులు, గుంపులుగా పందులు పంటలపై దాడికి పాల్పడి ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే వందల ఎకరాల్లో వేరుశనగ, మొక్కజొన్న పంటలు అడవి పందులు దాడి చేయడంతో దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి పందులకు వాసన పసిగట్టే గుణం ఎక్కువగా ఉండడంతో దూరం నుంచే పంటలను గుర్తించి దాడి చేస్తున్నాయని రైతులు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు చేతికి వచ్చే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్న సమయంలో అడవి పందులు గుంపులుగా దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందల ఎకరాల్లో దెబ్బతింటున్న పంటలు
కాపాడుకునేందుకు అన్నదాతల అగచాట్లు
తీవ్ర ఇబ్బందులు
వేరుశనగ, మొక్కజొన్న పంటల్లో పందుల దాడి అధికంగా ఉంటోంది. అడవి పందులు, నెమళ్లు, కోతులు సంతతి పెరగడంతో వాటి నుంచి పంటలను రక్షించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం. అడవి పందుల కోసం వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలు కొనుగోలు చేసి కడుతున్నాం. నెమళ్ల నుంచి పంట రక్షణకు కచ్చితంగా కాపలా ఉండాల్సి వస్తోంది. అవి తినేది కొంత అయితే నష్ట పరిచేది అధికంగా ఉంటుంది.
– మారుతీరెడ్డి, రైతు, వెంకటగారిపల్లి
బీడుగా వదిలేశా..
మా గ్రామం అడవికి పక్కనే ఉంది. అడవి జంతువులు నిత్యం పంటలను నాశనం చేస్తుండడంతో ఈ సారి పంటలు సాగు చేయలేక పొలాన్ని బీడుగా వదిలేశా. బోర్లలో నీళ్లు ఉన్నా పంటలను సాగు చేయలేకపోతున్నాం. ప్రకృతి వైపరీత్యాల కంటే అడవి జంతువుల నుంచి నష్టం ఎక్కువగా ఉంటోంది.
– రాజశేఖర్, రైతు, దిగువచెర్లోపల్లి
పంటలపై పందుల దాడి
పంటలపై పందుల దాడి
పంటలపై పందుల దాడి