
ఇంజినీరింగ్‌తో బంగారు భవిష్యత్తు
బుక్కరాయసముద్రం: ఇంజినీరింగ్‌తో బంగారు భవిష్యత్తు ఉంటుందని ఏపీ ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ఆచార్య డాక్టర్ హేమచంద్రారెడ్డి అన్నారు. బీకేఎస్ మండలం రోటరీపురం సమీపంలో ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాల 3వ స్నాతకోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ హేమచంద్రారెడ్డి, కళాశాల కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ చదవడానికి ముందు మంచి కళాశాల ఎంపిక ముఖ్యమన్నారు. నాలుగేళ్ల పాటు క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకుంటే నాలుగు దశాబ్దాల పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో 3వ స్నాతకోత్సవం జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా తాను, తన భార్య జొన్నలగడ్డ పద్మావతి 2008లో ఈ కళాశాలను స్థాపించినట్లు గుర్తు చేశారు. దినదినాభివృద్ధి చెందుతూ నాణ్యతా ప్రమాణాలతో అటానమస్ హోదా దక్కించుకుందన్నారు. కళాశాలలో బీటెక్ పూర్తి చేసుకున్న 620 మందికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశామన్నారు. వీరిలో 430 మందికి దేశంలోనే ప్రముఖ కంపెనీల్లో రూ.4 లక్షల నుంచి రూ.9లక్షల వరకు ప్యాకేజీతో ఉద్యోగాలు దక్కాయన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ(ఏ) ప్రతినిధి వేణుగోపాలరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్‌రెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎస్‌ఆర్‌ఐటీ స్నాతకోత్సవంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ డాక్టర్
హేమచంద్రారెడ్డి

ఇంజినీరింగ్‌తో బంగారు భవిష్యత్తు